విజయవాడ: విశాఖపట్నం చుట్టుప్రక్కల జగన్ సూచనల మేరకు ఎంపీ విజయసాయి రెడ్డితో ఇతర నాయకులు భారీఎత్తును  భూములు కొనుగోలు చేశారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. మధురవాడ, భోగాపురం ప్రాంతంలో వైసిపి నేతలు దాదాపు 6వేల ఎకరాల భూములను తక్కువ ధరలకే కొనుగోలు చేశారని... దీనిపై సీబీఐ విచారణ జరిగితే అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటో బట్టబయలవుతుందని అన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ముఖ్యమంత్రి జగన్ అమరావతి వికేంద్రీకరణ చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అమరావతి వికేంద్రీకరణ కాదని ముఖ్యమంత్రి జగన్ గుర్తిస్తే బావుంటుందన్నారు. 

జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో ప్రాంతీయ విద్వేషాలు, కుల మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎక్కువై శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందన్నారు. ఏడు నెలలుగా కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలతో శాసన సభ్యులు, మంత్రులతో  ప్రకటనలు ఇప్పిస్తున్నారని అన్నారు. 

video: ఎన్నార్సీపై వైసిపి ప్రభుత్వ విధానమిదే: అంజాద్ బాషా

నేడు  ఏకంగా 9వేలకోట్ల పైనే పనులు జరిగిన అమరావతి గొంతుకోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కేంద్రంగా అన్ని శాఖలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఓర్వలేక, తట్టుకోలేక జగన్ ఇటువంటి కుట్రలకు పాల్పడ్డాడని ఆరోపించారు. 

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు నేడు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి తాడేపల్లి భవనంలో వీడియో గేములు ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. 

పోలవరాన్ని చంపేసిన జగన్ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ అటకెక్కించేశాడని ఆరోపించారు. కక్షతో విద్వేషంతో రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై మంత్రులు నోళ్ళు తెరవాలన్నారు. 

రాజధానిపై మొదటినుంచి కుప్పి గంతులు వేస్తున్న అసమర్ధ ముఖ్యమంత్రి వల్ల ఇవాళ రైతులు, రైతుకూలీలు రోడెక్కారని.... 29గ్రామాల్లో దాదాపు 29వేల మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు యువత పురుగుమందు డబ్బాలతో ప్రాణ త్యాగాలకు సిద్ధపడే పరిస్థితి తెచ్చారన్నారు. 

తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆయన తెలివితక్కువ నిర్ణయాల వల్ల రాష్టం సమస్యల వలయంలో చిక్కుకుందని అన్నారు. అనంతపురం నుంచి విశాఖ వెళ్లాలంటే 890పైచిలుకు కిలోమీటర్లు వెళ్ళాలని...అదూ కర్నూలు నుంచి 600కిలోమీటర్ల పైనే దూరం ఉందని గుర్తుచేశారు. 

read more  ఉపాధి పనుల్లో ఇసుక కొరత వుంటే ఏ చేయాలంటే: అధికారులకు మంత్రి సూచన

పిల్లచేష్టలు, అనుభవరాహిత్యంతో ముఖ్యమంత్రి తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం పక్కన పెట్టి తెలుగుదేశం ప్రారంభించిన అభివృద్ధిని కొనసాగించాలని సూచించారు. రాజధానిపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.