అమరావతి: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంకు 50 కోట్ల రూపాయల మేరకు ఉపాధి హామీ పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు గానూ 8వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 

సచివాలయంలో బుధవారం పది జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఉపాధి హామీ పనుల ప్రాధాన్యతలను గురించి వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో కేటాయించిన నిధులకు గానూ మూడురెట్ల ప్రతిపాదనలతో పనులను చేపట్టాలని సూచించారు. 

కేంద్రప్రభుత్వం ఎంపిలకు ఈ ఏడాది మూడు కోట్ల రూపాయలు కేటాయించిందని, ఆ నిధులను కూడా ఉపాధి హామీకి కన్వర్జెన్సీ కింద ఎంపీల సహకారంతో కేటాయింపులు చేస్తే... వాటికి తొంబై శాతం నిధులను ఉపాధి హామీ నుంచి అందించేందుకు సిద్దంగా వున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎంపీలకు కూడా ప్రభుత్వం తరుఫున లేఖలు రాశామని అన్నారు. 

గ్రామ సచివాలయాల నిర్మాణంకు సంబంధించి మూడు కేటగిరిలను ప్రభుత్వం ఖరారు చేసిందని అన్నారు. గరిష్టంగా ప్రతి గ్రామపంచాయతీకి నలబై లక్షల రూపాయల మేరకు ఉపాధి హామీ కింద నిధులను అందచేస్తున్నామని తెలిపారు. 

READ MORE  రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు... ఎలా పనిచేయనుందంటే

సుమారు రూ.2వేల కోట్లతో ఉపాధి హామీ పనులకు అనుమతులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కింద సుమారు 2 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్న పనులకు అనుమతులు మంజూరు చేసినట్లు ట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంకు కేటాయించిన 6621.99 కోట్లకు గానూ ఇప్పటి వరకు 4423.09 కోట్ల రూపాయల పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8146 గ్రామసచివాలయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు తెలిపారు. వీటిల్లో ఇప్పటికే 5202 సచివాలయాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని, దీనికి గానూ మొత్తం 1582.80 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8145 సిసి డ్రైన్‌ లను మంజూరు చేశామని, వీటిల్లో 190 కోట్ల రూపాయల విలువైన 1032 పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వం కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి భూములను మెరక చేసుకునేందుకు 6873 పనులకు అంచనా వేశామని అన్నారు. వీటిల్లో ఇప్పటికే 222.45 కోట్ల రూపాయలతో 2234 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద రాష్ట్రంలోని 6010 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణంకు అనుమతులు మంజూరు చేశామని, వీటికి 48.94 కోట్లతో 4603 పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. 

ఉపాధి పనులకు స్థానిక వనరుల నుంచి ఇసుక

ఏజెన్సీ ఏరియాలతో పాటు పలుచోట్ల దూరప్రాంతాల నుంచి ఇసుకను తీసుకురావాల్సి వస్తోందని, దానివల్ల ఆర్థికంగా భారం పడుతోందని పలువురు ఎమ్మెల్యేలు చేసిన సూచనలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఇటువంటి సమస్య వున్న చోట కేవలం ఉపాధి పనులకు మాత్రమే స్థానికంగా లభించే ఇసుకను వినియోగించాలని, అందుకు గానూ ఎంపిడిఓల ద్వారా అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలను ఎపిఎండిసికి పంపించాలని సూచించారు.

రాబోయే మూడు నెలల్లో మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి స్థాయిలో వాడుకోవాలని కోరారు. గ్రామ సచివాలయాలతో పాటు సిసి రోడ్లు, నాడు-నేడు పాఠశాలల ప్రహరీలు, సిసి డ్రైనేజీలు, ఇళ్ల స్థలాల మెరక పనులను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని అన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిడిఓ, నరేగ ఎపిఓ, పంచాయతీరాజ్‌, ఆర్ డబ్ల్యుఎస్, తాహసిల్థార్, సర్వశిక్షాభియాన్ అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సలహాలను కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. 

READ MORE ఏపీ రాజధాని: అమరావతిని చీకి పాతరేసిన వైఎస్ జగన్

ఉపాధి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వుండదు

ఉపాధి హామీ కింద చేపడుతున్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం వుండదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు ఏడు వందల కోట్ల రూపాయల వరకు బిల్లలను చెల్లించామని, మరో మూడు వందల కోట్ల రూపాయల వరకు చెల్లింపులకు సిద్దంగా వున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనులకు కూడా ఉపాధి హామీ కింద నిధులను ఓవర్ ల్యాప్ చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలు వున్నాయని తెలిపారు.

కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, ముందస్తుగా రాష్ట్రమే అధికంగా ఈ చెల్లింపులు జరిపిందని తెలిపారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోందని, విచారణ తరువాతే ఈ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు జరుగుతుందని అన్నారు. ఆయా జిల్లాల్లో సిమెంట్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. 

ఇళ్ల స్థలాల మెరకకు ట్రాక్టర్ ల ద్వారా మట్టి తరలింపు

రాష్ట్రంలో పేదలకు ఇచ్చేందుకు నిర్ణయించిన ఇళ్ల స్థలాలను మెరక చేసేందుకు మట్టిని ట్రాక్టర్ ల ద్వారా మాత్రమే తరలించాలని మంత్రి తెలిపారు. ఎకరానికి నాలుగు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకువెళ్లవచ్చని అన్నారు. చెరువుల నుంచి మట్టిని ఉపాధి హామీ కూలీలతో తవ్వకాలు చేసుకుని, అయిదు కిలోమీటర్ల లోపులో ట్రాక్టర్ ల ద్వారా మాత్రమే స్థలాల మెరకకు వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే కచ్చా డ్రైన్లు, అంతర్గత డ్రైనేజీలను కూడా ఉపాధి హామీ కింద చేపట్టేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు అయిదు కిలోమీటర్లు మించకుండా అప్రోచ్ రోడ్ లను నిర్మించుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం నియోజకవర్గంకు కోటి రూపాయల వరకు కేటాయించిందని, ఈ నిధులను కూడా ఉపాధి హామీకి కన్జర్వెన్సీ కింద అందిస్తే, దానికి మ్యాచింగ్ గా ఉపాధి హామీ నిధులు తీసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. 

ఈ సమావేశంలో మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, అనీల్ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్‌, పినిపె విశ్వరూప్, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కె.కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌,  పలువురు ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.