ఈ ఐదింటిపై అప్పుడేమన్నారు...? ఇప్పుడేం చేస్తున్నారు...?: జగన్ ను నిలదీసిన బోండా ఉమ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఏం హామీలిచ్చారు... ఇప్పుడు వాటినెలా అమలు చేస్తున్నారో ప్రజలు ఓ సారి గమనించాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ సూచించారు. వాటికి సంబంధించిన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

TDP Ex MLA Bonda Uma Serious Comments and Questions YS Jagan

గుంటూరు: ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అధికారం పొందడంకోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్‌ రెడ్డి ఈనాడు వాటన్నింటికీ పంగనామాలు పెడుతూ ప్రజలను నిలువునా మోసగించాడని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.  గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

ప్రతిపక్షంలో ఉండి అబద్ధాలు, మోసపు మాటలతో ప్రజల్ని వంచించిన జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రయ్యాక తానిచ్చిన హామీలను గాలికొదిలేసి ఎలా నీరుగార్చాడన్నది రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన సమయం వచ్చిందన్నారు. అధికారం కోసం జగన్‌ ఎంతకైనా దిగజారుతాడని, తన స్వార్థంకోసం ఎంతకైనా తెగిస్తాడని ఆయన మాట్లాడిన మాటలే రుజువుచేస్తున్నాయన్నారు. 

పలు హామీలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఏంచెప్పాడో, అధికారం దక్కగానే వాటినెలా నీరుగార్చాడనేది వీడియోల ద్వారా  బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశంలో చూపించారు. 

1. ప్రత్యేకహోదాపై :  

ఆనాడు 25మంది ఎంపీలను ఇస్తే, ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్‌, రాష్ట్రపగ్గాలు దక్కగానే ప్లీజ్‌ప్లీజ్‌ అనడం తప్ప మరోమార్గం లేదంటూ మోదీ ముందు మెడలు వంచి నిలుచున్నాడన్నారు. తనపై ఉన్న కేసులనుంచి బయట పడానికి మోదీకాళ్లుపట్టుకనే స్థాయికి రాష్ట్రముఖ్యమంత్రి దిగజారాడన్నారు. ఆనాడు విభజనచట్టం హామీలన్నీ అమలయ్యేలా చేస్తాను, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానన్న వ్యక్తి, ఈనాడు  పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలను కూడా తీసుకురాలేని స్థితికి చేరాడన్నారు.
    
2. రాజధాని ఏర్పాటుపై :

ఆనాడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి జై కొట్టిన జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రయ్యాక విశాఖకు జై కొట్టడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. విశాఖలో తనకున్న భూములను అమ్ముకోవడానికి, అక్కడ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ఆయన తననిర్ణయాన్ని మార్చుకున్నాడని, అందులో భాగంగా నే పులివెందుల పంచెల బృందాన్ని విశాఖనగరంపైకి వదిలాడని బొండా దుయ్యబట్టారు . పంచెల బ్యాచ్‌ని చూసిన విశాఖవాసులు తమ స్థలాలకు, పొలాలకు కంచెలువేసుకుంటున్నారన్నారు. 

read more   ఆ నిర్ణయంతో లోకేశ్, యనమల మైండ్ బ్లాంక్... చంద్రబాబు అయితే...: మంత్రి కన్నబాబు

జగన్‌తోపాటు అనాడు రాజధానిగా అమరావతి ఏర్పాటుని స్వాగతించిన ఆయన జఫ్ఫా బ్యాచ్‌ రోజా, ఉమ్మారెడ్డి, ఆంధ్రా బిత్తిరిసత్తి బొత్స నేడు దానిగురించి ఎందుకు మాట్లాడటం లేదని ఉమా నిలదీశారు. అమరావతి ఎక్కడికీపోదని, తెలుగుదేశం కావాలనే రాద్ధాంతం చేస్తుందన్న మంత్రి బిత్తిరిసత్తి ఇప్పుడు మంత్రి పదవిపోతుందన్న భయంతో జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడన్నారు. మరోమంత్రేమో అమరావతిలో పశువులు తిరుగుతున్నాయని చెప్పాడని, ఆయన ఉద్దేశం ప్రకారం నేడు అక్కడ తిరుగుతున్న 151మంది వైసీపీసభ్యులు పశువులేనా అని బొండా ప్రశ్నించారు.

3. వివేకాహత్యకేసు విచారణపై :

సొంతబాబాయి హత్యకు గురైతే జగన్‌, ఆయన మీడియా ఆనాడు దాన్ని సాధారణ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయని, పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించాక తనవాళ్ల వ్యవహారం బయట పడుతుందన్న భయంతో కేసుని సీబీఐకి అప్పగించాలంటూ నానాయాగీ చేశాడన్నారు. ఆనాడు వివేకాహత్య కేసుపై గవర్నర్‌కు ఫిర్యాదుచేసి సీబీఐ విచారణ కోరిన జగన్‌ ఈనాడు సీఎం అయ్యాక హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించు కున్నాడని బొండా నిలదీశారు. 

ఆనాడు ఊరూరా తిరుగుతూ, తన జప్ఫాబ్యాచ్‌ను వెంటేసుకొని మొసలికన్నీరు కారుస్తూ వివేకాహత్యకేసుని సీబీఐకి అప్పగించాలన్న వ్యక్తే ఈనాడు ఎందుకు వెనకడుగు వేశాడో చెప్పాలన్నారు. వివేకా కుమార్తె, భార్యలు సీబీఐ విచారణకోరుతున్న తరుణంలో ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్‌రెడ్డి వారిడిమాండ్‌ ను మన్నించి, కేంద్రానికి ఎందుకు లేఖరాయడంలేదో సమాధానం చెప్పాలన్నారు.

4. 45 ఏళ్లకే పింఛన్లు :

ఆనాడు పాదయాత్రలో మ్లాడుతూ ప్రతిఅక్కకు, చెల్లికి, 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నెలకు రూ.3వేలవంతున  పింఛను ఇస్తానని చెప్పిన జగన్‌రెడ్డి నేడు ఆహామీకి పాతరేసి, ఉన్నపింఛన్లు ఊడపీకే పనిలో పడ్డాడని బొండా మండిపడ్డారు. దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 30లక్షల మందికి రూ.200వంతున పింఛన్లు ఇస్తే చంద్రబాబునాయడు 54లక్షలమందికి రూ. 2వేల చొప్పున అందించాడన్నారు. 

read more  సీఎం జగన్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీస్‌ ఇస్తాం ...: ఎమ్మెల్సీ అశోక్ బాబు

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే 7లక్షల పింఛన్లు తొలగించాడని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తీరని అన్యాయం చేశాడన్నారు. చివరకు జగన్‌ నియమించిన వాలంటీర్లు తమకు డబ్బులివ్వడంలేదన్న దుర్భుద్ధితో అర్హులైనవారి పింఛన్లు తొలగిస్తున్నా ముఖ్యమంత్రి  స్పందించడంలేదన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా, అర్హులైనవారికి పింఛన్లు వచ్చేలా చూస్తామని ఉమా తేల్చిచెప్పారు.

5. అమ్మఒడి పథకంపై :

ఆనాడు బడికిపంపిన ప్రతిపిల్లాడికి ఈ పథకం వర్తింస్తుందన్న జగన్‌రెడ్డి ఇప్పుడూమో పిల్లలకు కాకుండా ప్రతి తల్లికి అంటూ మెలికపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారిలో సగంమందికే అరకొరగా అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తున్నాడన్నారు. ఇచ్చినవాటిలో మరోవెయ్యిని బడులబాగుకోసం వసూలుచేయమని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆనాడు తల్లులకు ఆశపెట్టిన జగన్‌ నేడు అమ్మఒడి అమలులో 300యూనిట్ల కరెంట్, వాహనం, బ్యాంకురుణం అంటూ కుటిసాకులు చెబుతూ అమ్మఒడిని కోతలఒడిగా మార్చాడన్నారు.

ఇలా ఈ అయిదు అంశాలపైనే కాకుండా అనేక హామీలపై జగన్‌ ఇచ్చినమాట తప్పాడని, సోమవారం వాటినికూడా పత్రికాముఖంగా ప్రజలకు తెలియచేస్తామని టీడీపీనేత స్పష్టంచేశారు. అప్పటిలోగా జగన్‌ తానిచ్చిన హామీలు, ముఖ్యమంత్రయ్యాక  వాటినిఅమలు చేయకుండా ఎలా తప్పించుకున్నాడో ఆయనకు ఆయనగా ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలని బొండా డిమాండ్‌చేశారు.  
 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios