గుంటూరు: తానెందుకు ఢిల్లీ వెళ్లొచ్చారో... ప్రధానితో ఏం చర్చించారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు స్పష్టం చేయలేదని... అయితే శాసనమండలి  రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించడానికే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు స్పష్టమవుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  

తనకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అక్కసుతో మండలిని రద్దు చేయాలనుకుంటున్న జగన్‌ అధికారముంటే రాజ్యసభ, లోక్‌సభలను కూడా రద్దుచేసి ఉండేవాడని అశోక్‌బాబు ఎద్దేవా చేశారు. జగన్‌ తన రాజకీయ కక్షకోసమే మండలిరద్దుకు పూనుకున్నాడనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకునేందుకు కలిసివచ్చే ఇతరపార్టీల సభ్యులను కలుపుకొని ఢిల్లీకి వెళతామని తెలిపారు. 

read more  పులివెందులపై మరిన్ని వరాలు... సీఎం జగన్ నుండి అధికారులకు ఆదేశాలు

ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి మండలి రద్దుకు జగన్‌ అనుసరిస్తున్న కారణాలను వారికి వివరిస్తామన్నారు.  పది రాష్ట్రాలు మండలి ఏర్పాటును కోరుకుంటున్నాయని... కేవలం తన నిర్ణయాన్ని అడ్డుకున్నారన్న అక్కసుతోనే జగన్‌ పెద్దలసభపై కక్ష కట్టాడన్నారు. సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాలను అడ్డుకోవడమే మండలిచేసిన తప్పిదంగా జగన్‌ భావిస్తున్నాడన్నారు. 

ఇదివరకే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నామని, పార్లమెంట్ సమావేశాలు, అమరావతి జేఏసీ సభ్యుల ఢిల్లీ పర్యటనతో తమ నిర్ణయాన్ని వాయిదావేసుకున్నామని అశోక్‌బాబు తెలిపారు. అసెంబ్లీలో మేదావులున్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నందుకు బాధ్యత వహిస్తూ అసెంబ్లీని కూడా రద్దుచేయాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. 

read more  చంద్రబాబు జైలుకే... ఆ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన అక్రమ సంపాదనే...: రామచంద్రయ్య

కేవలం బిల్లులకు సూచనలు, సవరణలు చేశారని వ్యవస్థల్ని రద్దుచేయాలనుకునే ముఖ్యమంత్రి అసెంబ్లీ  రాష్ట్రానికి అవసరంలేదని దాన్ని రద్దుచేస్తాడా అని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలెవరూ అడ్డదారుల్లో, గాలికి కొట్టుకురాలేదనే విషయాన్ని జగన్‌ గుర్తిస్తే మంచిదన్నారు.