విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు తనపై కోపం వుంటే వ్యక్తిగతంగా తీర్చుకోవాలని... కానీ ఇలా అమరావతిపై చూపిస్తూ అక్కడి ప్రజలకు అన్యాయం చేయవద్దని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ విజయవాడ  బెంజ్ సర్కిల్ వేదిక కల్యాణ మండపంలో 24 గంటల నిరాహారదీక్షకు దిగిన టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను చంద్రబాబు పరామర్శించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజకీయ చైతన్య కలిగిన ప్రాంతం విజయవాడ అని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖ మొదలు కర్నూల్ వరకు అన్ని విధాలుగా ఆర్ధిక నగరాలను తీర్చిదిద్దామని అన్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతిలో కూడా పరిపాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 

ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతి కోసం ఒక్క పైసా కూడా ఖర్చుచేయాల్సిన పని లేదన్నారు. అలాంటి రాజధానిని అనవసరంగా మార్చడానికి ప్రయత్నిస్తూ జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందని ఆరోపించారు. కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  

read more  చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు... బర్తరఫ్ చేయాలని డిమాండ్: వైసిపి ఎమ్మెల్యే

ఇన్సైడ్ ట్రెడింగ్ పేరుతో అమరావతి జోలికొస్తే ఒప్పుకునేది లేదు... ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అనుకూలమని శివరామకృష్ణన్ కమిటీ తేల్చిందన్నారు. అలాంటి చోట రాజధాని వుంటే వైసిపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటో అర్ధంకావడం లేదన్నారు.

ప్రపంచంలో ఏ నాగరికత అయినా వెలసిందే నదుల ప్రక్కనే అన్నచిన్న విషయం కూడా సీఎం జగన్ కు తెలియనట్లుందని ఎద్దేవా చేశారు. రాజధానిపై బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రశ్నిస్తే దళిత అధికారిని కించపరిచానని అపవాదు వేస్తున్నారని అన్నారు. తాను ప్రజాస్వామ్యవాదిని ఎప్పుడు ఎవ్వరినీ కించపరిచి మాట్లాడలేదన్నారు. 

అమరావతి మద్దతుదారులపై కేసులు వేస్తూపోతే పోలీస్ స్టేషన్లు సరిపోవన్నారు. ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలకు దూరంగా అమరావతి ప్రజలు కాలం వెళ్లదిస్తున్నారని... అందుకు వైసిపి ప్రభుత్వ దుర్మార్గ పాలనే కారణమన్నారు. 

 షాక్ : విశాఖలో చంద్రబాబుపై కేసు

గతంలో తాను అమరావతి పర్యటనకు వెళ్తే తన వాహనంపై కొందరు చెప్పులతో దాడి చేశారని... అప్పుడు ప్రజాస్వామ్యంలో ఇవన్ని సహజమేనని డిజిపి అన్నారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని... గతంలో మీరు పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యం  ఏమయ్యిందని ప్రశ్నించారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దన్నారు. రాజధాని కేవలం అమరావతి ప్రాంత ప్రజలు, రైతుల సమస్య మాత్రము కాదని ఇది యావత్ రాష్ట్ర ఐదుకోట్ల ప్రజల సమస్య అని చంద్రబాబు అన్నారు.