13 జిల్లాలకు 13 రాజధానులు ప్రకటిస్తారా...: పితాని సెటైర్లు
రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తప్పుబట్టారు. ఆయనకు రాష్ట్ర పాలన అప్పగించడం పిచ్చోడి చేతికి రాయిని అందించినట్లు వుందన్నారు.
అమరావతి: ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం పనితీరు వుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వడ్డించిన విస్తరిలా అన్ని హంగులతో అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు కట్టిస్తే దానిని అభివృద్ధి చేయడానికి డబ్బులేవని నిన్నటి వరకు ఏడ్చి... నేడు ఉన్నపళంగా మూడు రాజధానులు అంటూ ప్రకటించడం మూడు మూసి ఆరు వెతుకోవడమనే సామెతను గుర్తు చేస్తుందన్నారు.
జగన్ తుగ్లక్ చర్యలకు ఈ నిర్ణయాలే అద్దం పడుతున్నాయన్నారు. 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 13 రాజధానులు ప్రకటిస్తావా అని ప్రశ్నించారు. పిచ్చి తుగ్లక్ చేష్టలు చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం తయారయ్యిందని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడిదారులు రాకపోగా గతంలో వచ్చిన వాళ్లు కూడా జగన్ దుష్చర్యలకు పలోమని పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. పిల్లిని చూసి పులని అనుకున్నామని ఆయనకు ఓటు వేసిన వారే బాధపడే స్థితికి వైసీపీ ప్రభుత్వం దిగ జారిపోయిందని విమర్శించారు.
read more జగన్, విజయసాయిల చెరలో విశాఖభూములు... ఆధారాలివే: దేవినేని ఉమ
గ్రామ సచివాలయాల్లో కుర్చీలు వేసేందుకు కూడా నిధుల లేవు గాని వాటిని తమ పార్టీ రంగులు మాత్రం వేస్తున్నారన్నారు. ఆఖరికి జాతీయ జెండా, మహాత్మా గాంధీ విగ్రహాలకు పార్టీ రంగులేసిన ఘనత ఒక్క జగన్మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలోని ప్రజలకు పనుల్లేవు, ఉపాధి లేదు... వాటిని పట్టించుకోకుండా రాజధాని పేరుతో ముఖ్యమంత్రి రాద్దాంతం ఎందుకు చేస్తున్నారన నిలదీశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారించి చర్యలు తీసుకోండి.... అంతేగాని దాన్ని సాకుగా చూపి రాజధాని మార్చేస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని పితాని ఆరోపించారు.
read more విశాఖకు న్యాయం కాదు...అన్యాయం చేసిందే జగన్: కళా వెంకట్రావు