Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు న్యాయం కాదు...అన్యాయం చేసిందే జగన్: కళా వెంకట్రావు

రాజధానిని విశాఖకు తీసుకువెళ్లి తానేదో ఆ ప్రాంతాన్ని ఉద్దరిస్తున్నట్లు జగన్ బిల్డప్  ఇస్తున్నారని.... కానీ నిజానికి ఆ ప్రాంతానికి అన్యాయం చేసిందే ఆయనని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

kala venkatrao  reacts on ap capital issue... fires on cm ys jagan
Author
Amaravathi, First Published Dec 20, 2019, 8:17 PM IST

గుంటూరు:  తన ప్రభుత్వ పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సాక్షిగా కొత్తభాష్యాలు చెప్పారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. కనీసం తన మంత్రివర్గానికి కూడా సమాచారం లేకుండా అమరావతిపై ఇష్టానుసారం ప్రకటన చేశారని... అందువల్లే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 

శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన ప్రభుత్వం రాజధానిపై నియమించిన జీఎన్‌.రావు కమిటీ నివేదిక రాకముందే ముఖ్యమంత్రి ఊహాగానాలు చేయడం రాజ్యాంగానికే విరుద్దమన్నారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 

గత 6నెలల కాలంలో అవినీతే ధ్యేయంగా జగన్‌ పాలనసాగించాడని కళా తెలిపారు. తన వ్యాఖ్యలతో రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని సీఎం రుజువు చేశాడని, ఆయన వచ్చినప్పటినుంచీ కూల్చివేతలు, రద్దులు, రివర్స్‌లే సరిపోయాయన్నారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి రేషన్‌ బియ్యానికి పాలిష్‌పట్టి పంపిణీచేసే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని వెంకట్రావు మండిపడ్డారు. 

పింఛన్లు,  చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోఫాలు, అన్నా క్యాంటీన్ల మూత, పోలవరం పనుల నిలిపివేతే కొనసాగిందన్నారు. రివర్స్‌ టెండర్ల పేరుతో డబ్బులు మింగడం తప్ప ప్రజల గురించి ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, ఇప్పటివరకు పండినపంటలు కొనుగోలు చేయకపోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. 

read more  రాజధాని వివాదం... జగన్ తో కాదు నేరుగా ప్రధాని మోదీతోనే: నాదెండ్ల

గిట్టుబాటుధర విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే సరిపోయిందని... ఊరికో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడా ఒక్క బస్తా ధాన్యం కూడా కొనలేదన్నారు.  సబ్సిడీపై రైతులకు అందించే వ్యవసాయ పరికరాల పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం నీటిపారుదల రంగ ప్రాజెక్టులు కూడా నిలిపివేసిందన్నారు. 

పేదలఉపాధి కోసం పెట్టిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని నిలిపివేసిన వైసీపీ సర్కారు చేసిన పనులకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వకుండా కూలీలు, కాంట్రాక్టర్లను వేధిస్తోందన్నారు. 

టీడీపీ పాలనలో రూ.1200లకు లభించిన ట్రక్కు ఇసుక, ఇప్పుడు రూ.4నుంచి 5వేలకు చేరిందని, ఇసుక కొరత సృష్టించి 50మంది చావులకు ఈ ప్రభుత్వం కారణమైందన్నారు. వైసీపీ  మాఫియా అంతా ఇసుకను దోచేస్తూ, ఎక్కువధరలకు అమ్మడం కోసమే 6నెలల్లో భవన నిర్మాణ కార్మికుల చావులకు పాల్పడిందని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విద్యుత్‌  రంగంలో పీపీఏలరద్దుతో  ప్రభుత్వం ఏం సాధించిందన్నారు. కేంద్రం కర్రుకాల్చి వాత పెట్టినా మారకుండా చివరకు రాష్ట్రాన్ని చీకట్లపాలు చేశారన్నారు. ఆర్టీసీఛార్జీలు పెంచి సామాన్యుడిపై రూ.700కోట్ల వరకు భారం మోపడం ద్వారా పరిపాలనలో విఫలమయ్యారని సుస్పష్టంగా అర్థమవుతోందన్నారు. తన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికే అసెంబ్లీలో ఆదరాబాదరాగా జగన్‌ 3 రాజధానుల ప్రకటనచేశాడని వెంకట్రావు తేల్చిచెప్పారు. 

read more  మూడు కాదు ముప్పై రాజధానులు ఏర్పాటుచేయాలి: జగన్ కు టిడిపి ఎంపీ సవాల్

ప్రతిపక్షనేతగా ఆనాడు రాజధానిని సమర్థించిన జగన్‌, నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజల్ని గందరగోళానికి గురిచేసేలా ప్రకటనలివ్వడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ విబేధాలతో, కులమతాలతో చిచ్చుపెట్టడం ద్వారా జగన్‌ రాష్ట్రాన్ని ఏం  చేయనున్నాడనే ఆందోళన కలుగుతోందన్నారు. విశాఖలో ఏర్పాటు  కావాల్సిన లులూ, ఆదానీ గ్రూప్‌ సంస్థలు వెనక్కు వెళ్లడానికి జగన్‌ వైఖరికారణంకాదా అని వెంకట్రావు ప్రశ్నించారు.     

Follow Us:
Download App:
  • android
  • ios