జగన్, విజయసాయిల చెరలో విశాఖభూములు... ఆధారాలివే: దేవినేని ఉమ
అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించడం ద్వారా భారీఎత్తున లబ్ది పొందేది వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలేనని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు.
విజయవాడ: విశాఖలో జరిగిన భూకుంభకోణం తాలూకా వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయని... సీఎం జగన్ ఆశీస్సులతో ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఇదంతా జరిగిందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పెద్దఎత్తున జరిగిన ఈ వ్యవహారంలో 6 వేలఎకరాలు చేతులు మారుతున్నాయని స్పష్టంచేశారు.
శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖలోని టైకూన్ రెస్టారెంట్ వద్ద కొన్ని క్రిస్టియన్ సంస్థల మధ్య 3.91ఎకరాలకు సంబంధించిన వివాదాలు కోర్టులో నడుస్తుంటే...హెగ్డే అనే వ్యక్తి సాయంతో ఆ భూమిని జగన్ అండ్ కో కబ్జా చేసిందన్నారు. గజం రూ.లక్షన్నర నుంచి 2లక్షలు పలికే ఆ భూమిలో 14 అంతస్థుల భవనానికి సంబంధించిన పనుల కోసం డిజైన్లు ఖరారయ్యాయని దేవినేని వివరించారు.
నిర్మాణదారులకు 60శాతం, భూమి ఉన్నవారికి 40శాతమనే ఒప్పందంతో రూ.వెయ్యికోట్ల విలువైన భూమిని రూ.50కోట్లకే జగన్ బ్యాచ్ సొంతం చేసుకుందన్నారు. జగన్, విజయసాయి రెడ్డి తమ పులివెందుల పంచాయతీతో ఈభూమిని హస్తగతం చేసుకొని లులూ సంస్థను విశాఖనుంచి వెళ్లగొట్టారని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు.
కోర్టు వివాదంలోని భూమిని ఆక్రమించుకోవడానికి, తన భూదాహం తీర్చుకోవడానికి జగన్ ఉవ్విళ్లూరుతున్నాడన్నారు. జగన్‌కు సన్నిహితుడైన ఆడిటర్ లక్ష్మినారాయణకు పద్మనాభం రోడ్డులో 100 ఎకరాల లేఅవుట్ ఉందన్నారు. ఆ ఆడిటర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేలా జగన్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడని ఉమా పేర్కొన్నారు. సిరిపురం ఏరియాలో మరో 100 ఎకరాల లేఅవుట్ ఉందని ఇవన్నీ బినామీపేర్లతో చేతులు మారాయన్నారు.
read more విశాఖకు న్యాయం కాదు...అన్యాయం చేసిందే జగన్: కళా వెంకట్రావు
మూడురాజధానుల్లో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ వస్తుందని చెబుతున్న లంకెలపాలెం ఏరియాలో ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రావు, దళారీ నాగేశ్వరరావుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివరాల సేకరణ 4నెలల క్రితమే ప్రారంభమైందన్నారు. కొత్తజైల్‌రోడ్‌లో 195 ఎకరాల గోల్ఫ్‌కోర్టు ఉంటే దానిపక్కనే 200 ఎకరాల ప్రభుత్వభూమి ఉందని, దాన్నికాజేసిన తరువాత గోల్ఫ్‌కోర్టు భూమిని కాజేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు.
ఎన్నికలకు ముందు వాల్తేర్‌క్లబ్‌లో సభ్యత్వం కోసం దెబ్బలాడిన విజయసాయిరెడ్డికి ఎన్నికల తర్వాత అక్కడ సభ్యత్వం లభించిందని, దానిలో కూడా 13ఎకరాల భూబాగోతం ఉందన్నారు. భీమిలి దగ్గరలో ముఖ్యమంత్రి నివాసం కోసం సముద్రం ఎదురుగా భూమిని సేకరించారని... విజయసాయి రెడ్డి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు.
కలెక్టర్లతో సమావేశాలు పెడుతూ, భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న ఏ2 మాటవినని అధికారులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడని దేవినేని మండిపడ్డారు. ఇంతపెద్దఎత్తున విశాఖలో భూఆక్రమణలు జరుగుతుంటే, రెవెన్యూమంత్రి నుంచి ఎక్కడా స్పందనలేదన్నారు.
వైఎస్ హయాంలో విశాఖలో ఎక్స్‌సర్వీస్‌మెన్లకు సంబంధించిన 170 ఎకరాల భూములు కూడా స్వాహా కానున్నాయన్నారు. చీఫ్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల సాయంతో ఈ దురాక్రమణ తంతు జరుగుతోందని మాజీమంత్రి తెలియచేశారు. సేవ్ విశాఖ పేరుతో ఒక స్వతంత్య్రసమరయోధుడు ఈ సమాచారాన్ని తనకు ఇచ్చారని... ఇదంతా మీరు బయటకు చెప్తే తనను చంపేసే అవకాశాలున్నాయని ఆయన తనతో చెప్పినట్లు దేవినేని చెప్పారు.
పరదేశిపాలెం, కాపులుప్పాడ, భీమిలి, కొత్తవలస, మొదలు భోగాపురం వరకు 6వేల ఎకరాలను కాజేయడానికి వైసీపీనేతలు, కార్యకర్తలు జగన్ కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక ఈ ఏడునెలల్లో ఎవరెవరి భూముల ఎలా చేతులుమారాయో సమాచారహక్కుచట్టం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
భూముల పంచాయతీల కోసం తాడేపల్లికి వచ్చి విజయ్‌ని కలవాలని వైసీపీవారు చెప్పారని, విజయ్ అంటే ఏ2 ముద్దాయనే విషయం తరువాత విశాఖవాసులకు తెలిసొచ్చిందన్నారు. అక్కడకు వచ్చాక ఎవరైనాసరే విజయ్ చెప్పింది ఒప్పుకోవాల్సిందేనన్నారు.
read more ఆ మంత్రిని తొలగించేలా జగన్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వండి: సీఎస్ కు టిడిపి నేతల ఫిర్యాదు
కుట్రప్రకారమే అమరావతి తరలింపుకు యత్నాలు
ఈ భూములకోసమే అమరావతిని శ్మశానంతో పోల్చి, రైతులను రోడ్డున పడేశారని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలోకి నీళ్లు పంపాలని, చంద్రబాబు ఇంటిని ముంచాలని ప్రభుత్వం కుట్రచేస్తే, రాజధాని రైతులు వెళ్లి కృష్ణానది గట్లను కాపాడుకోవడం జరిగిందన్నారు. అది వీలుకాకపోవడంతో కృష్ణా, గుంటూరుల్లో లంకభూములు ముంచేసి తొలికుట్ర చేశారని, రెండోకుట్రగా శ్మశానమని చెప్పారని, చివరకు పందులు తిరుగుతున్నాయని చెప్పి, అమరావతి తరలింపునకు కుట్ర చేశారని ఉమామహేశ్వరరా వు వివరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఒకబ్లాక్‌ను సీఎంఆఫీస్‌గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజధాని భూములపై ప్రభుత్వం హైకోర్టులో కూడా తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. అమరావతి గురించి మంత్రులు జోకర్లుగా మాట్లాడుతున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు.
జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి 29గ్రామాల్లో ఒక్కరోజు పాదయాత్ర చేసి రాజధాని మార్పుపై రైతుల్ని ఒప్పించాలని, అప్పుడు ఆయనసత్తా ఏంటో తెలుస్తుందని టీడీపీ సీనియర్ నేత సవాల్ విసిరారు. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖను కాపాడుకోవడానికి ఆ నగర యువత, మేధావులు, విద్యావేత్తలు, రాష్ట్రప్రజలు ముందుకు రావాలని దేవినేని పిలుపునిచ్చారు. జీ.ఎన్.రావుకమిటీ నివేదికను పక్కనపెట్టి, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.