Asianet News TeluguAsianet News Telugu

స్థానికులకే మొదటి ప్రాధాన్యత...అందుకోసమే ప్రత్యేక చట్టం: అవంతి

విజయవాడలోని కేబిఎన్ కాలేజీలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరాన్ని సహచర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

minister avanthi srinivas inaugurate a blood donation  camp at vijayawada
Author
Vijayawada, First Published Nov 27, 2019, 2:29 PM IST

విజయవాడ:  ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం ఐదు  నెలల్లోనే దాదాపు ఐదులక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇలా యువత భవిష్యత్ గురించి ఆలోచిస్తూ...వారికి అండగా నిలుస్తున్నది వైఎస్సార్‌సిపి ప్రభుత్వమే అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందని తెలిపారు. 

నగరంలోని కేబిఎన్ కాలేజీలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరాన్ని సహచర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి అవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... యువత కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్ అతి తక్కువ కాలంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం చేసిన దమ్మున్న ప్రభుత్వం తమదని అన్నారు. 

read more  జగన్ ఇలాఖాలోనే ఇదీ పరిస్థితి...మంచి సీఎం అంటే ఇదేనా...?: చంద్రబాబు

ఇక నిరుపేదల కోసం మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందన్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, పనుల్లో బడుగు బలహీన వర్గాలకు 50 శాతం అవకాశం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు  మంత్రి పేర్కొన్నారు. 

ప్రస్తుతకాలంలో రక్తదానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని....ఇలాంటి మంచి కార్యక్రమలు మరిన్ని జరగాలన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఎదుట వారి ప్రాణాలను కాపాడాలని సూచించారు. యువత రక్తదానంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలని అవంతి శ్రీనివాస్ సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొలువుల జాతర ప్రారంభించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలతో మెుత్తం భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారు సీఎం జగన్.  ఈ క్రమంలోనే మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 8వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిసర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

read more  క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది. మెుత్తం పోస్టుల్లో 2,400 ఎస్జీటీ పోస్టులు కాగా 3,600 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలోనే భర్తీ చేసేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. 

ఉద్యోగాలకు ఎంపికైన స్కూల్ ఎస్జీటీ టీచర్లకు రూ.5000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.700 జీతంగా చెల్లించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యావాలంటీర్లను నియమించాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.  

విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అత్యధికంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 800 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖ బలోపేతానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

అలాగే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా అమ్మఒడి వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లికి ఏడాదికి రూ.15వేలు చెల్లించనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios