కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జిల్లాలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై అధికార వైసిపి చేస్తున్న దాడులను ఖండించారు. తమ కార్యకర్తలను బెదిరించి వినకుంటే దాడులు చేసి మరీ తమ పార్టీలో చేర్చుకుంటున్నట్లు వైసిపి నాయకులపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికన సీఎం జగన్ కు చురకలు అంటిస్తూ ట్వీట్లు చేశారు.   

''సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత అరాచకమా? పార్టీ మారకపోతే చంపుతారా? ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం? అయినప్పటికీ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదిలేది లేదన్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. నిబ్బరంగా ఉందాం, ధైర్యంగా ఎదుర్కొందాం. అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేద్దాం''

''ఈరోజు కడప జిల్లాలో వైసీపీ ప్రభుత్వ బాధితులను కలుసుకున్నాను. వైసీపీ నేతలు గూండాల్లా తెదేపా కార్యకర్తలను ఎలా హింసించారో కళ్ళ నీళ్ళు పెట్టుకుని వారు వివరిస్తుంటే భావోద్వేగానికి గురయ్యాను. అయినప్పటికీ తెదేపానే అంటిపెట్టుకుని ఉంటామంటున్న నా కార్యకర్తలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది'' అంటూ చంద్రబాబు తాజాగా ట్వీట్ చేశారు. 

read more  చీరాలలో ఉద్రిక్తత... కరణం, ఆమంచి వర్గీయుల భాహాభాహీ

అంతకుముందు రాజధాని అమరావతిని శ్మశానవాటికతో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణపై చంద్రబాబు ఫైర్ అవుతూ కొన్ని ట్వీట్స్ చేశారు. ''రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. తెదేపా హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా ఉండేది. అటువంటి సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు.''   

''కానీ మంత్రి బొత్సాగారు ప్రజారాజధానిని శ్మశానంతో పోల్చి 5కోట్ల ఆంధ్రులనే కాదు, శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా అవమానించారు. అక్కడున్న విశ్వవిద్యాలయాలు మీకు స్మశానాలా? హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీ కళ్లకు స్మశానాల్లా కనిపిస్తున్నాయా?'' అంటూ  చంద్రబాబు విరుచుకుపడ్డారు. 

read more సీఎం జగన్ మాటలనే మంత్రి అనిల్ తప్పుబడుతున్నాడు...: దేవినేని ఉమ