అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, అసుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఎసి) సోమవారం అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు జనసేన  పార్టీ అధికారంగా ఈ సమావేశం గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. 

సోమవారం సాయంత్రం ఈ సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం అయిదు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. 

ఏపి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవలసిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బిజెపితో పొత్తు, కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు జనసేన పార్టీ మీడియా విభాగం ప్రకటించింది. 

read more  బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. జనసేనను విలీనం చేయాలని బిజెపి అడిగినప్పటికీ పవన్ కల్యాణ్ అంగీకరించకపోవడంతో చివరకు పొత్తుకు బిజెపి సిద్ధపడింది. వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి బిజెపికి అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించలేదు. 

 పవన్ కల్యాణ్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కూడగట్టే చరిష్మా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచినప్పటికీ బిజెపి ఓట్లు కూడా కలిస్తే బలం పెరిగే అవకాశాలు లేకపోలేదు. భవిష్యత్తులో జనసేన, బిజెపి పొత్తు వల్ల సంభవించబోయే పరిణామాల గురించి వైఎస్ జగన్ కు గుబులు పట్టుకున్నట్లే అనుకోవాలి. రాజకీయంగానే కాకుండా ఇతరత్రా కూడా వైఎస్ జగన్ కు చిక్కులు ఎదురు కావచ్చు. 

ఇకపోతే, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఒక్కరకంగా షాక్. పవన్ కల్యాణ్ తో పొత్తు లేదా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు ఆశిస్తూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నట్లే కనిపించారు. కానీ, ఒక్కసారిగా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడ్డారు. ఇది చంద్రబాబుకు అయిష్టమైన వ్యవహారమే.

read more  బిజెపితో జనసేన పొత్తు... టిడిపి పరిస్థితి ఏంటంటే: మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలు

బిజెపితో పొత్తు ఖరారైన తర్వాత పవన్ కల్యాణ్ చంద్రబాబుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన చంద్రబాబును తప్పు పట్టారు. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల చంద్రబాబుతో దోస్తీ కుదురుతుందని ఇప్పటికిప్పుడైతే అనుకోలేం. తొలుత చంద్రబాబును వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి రావాలని, ఆ తర్వాత వైఎస్ జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలనేది పవన్ కల్యాణ్ వ్యూహంగా భావించవచ్చు.