విశాఖపట్నం: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఏమాత్రం దెబ్బతీయబోవని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బిజెపి తో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల టిడిపి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరిపై ఆధారపడలేదని... కేవలం పటిష్టమైన కేడరే ఈ పార్టీకి బలమని గంటా అన్నారు. 

శనివారం టిడిపి  వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గంటా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే  పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ... నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడంలో తెలుగుదేశానికి మించిన పార్టీ లేదన్నారు.

read  more  కేంద్రం చూస్తూ ఊరుకోదు.. మూడు రాజధానులపై సుజనా చౌదరి

బిజెపి-జనసేన పొత్తుపై స్పందిస్తూ సందర్భాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్నారు. ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వారితో పొత్తులు పెట్టుకునే స్వేచ్చ ప్రతి రాజకీయ పార్టీకి వుంటుందన్నారు. జనసేనకు అవసరముందని భావించే ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ బిజెపితో చేతులు కలిపి వుంటారని... అంతమాత్రాన టిడిపికి కలిగిన నష్టమేమీ లేదన్నారు. 

40 శాతం ఓటుబ్యాంకును కలిగిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. గ్రామస్థాయిలో చెక్కు చెదరని కేడర్ వుండటం ఈ పార్టీకి పెద్ద బలమని... నేటికీ ఆ బలం అలాగే వుందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనాలే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష  అని గంటా పేర్కోన్నారు.