అలా చేస్తే జగన్ మరోసారి జైలుకే: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆచి తూచి వ్యవహరించాలని...లేదంటే మరోసారి జైలుకెళ్లాల్సి వస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం జగన్ ఉత్తమకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. నదులు అనుసంధానం ద్వారా గత టిడిపి హయాంలోనే 62 ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకువచ్చామని... ఈ విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని సూచించారు.
రాష్టానికి పరిశ్రమలు వచ్చే మాటేమో గానీ ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలన స్వర్ణయుగమైతే ఏడు నెలల వైసీపీ పాలన చెత్త పాలన అని విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజదాని విషయంలో జీఎస్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై అమరావతిలోనే చర్చించాలని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే 27న క్యాబినెట్ భేటీ అమరావతిలో పెట్టాలని మాజీ మంత్రి సవాల్ విసిరారు.
read more అమరావతికి రక్షణగా వున్న చట్టాలివే... ఒక్క కలంపోటుతో...: ఎంపీ కనకమేడల
ప్రజా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అమరావతి లోని 29 గ్రామాల ప్రజలు కష్టం కన్నీళ్ల జగన్ కు అసలు తెలుసా అని ప్రశ్నించారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీలుతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
భవిష్యత్ లో టిడిపి అధికారంలోకి రాగానే మొదట అమరావతిలోనే తొలి సమావేశం ఏర్పాటు చేస్తామని...ఇందులో విశాఖపట్నంలోో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పై చర్చిస్తామన్నారు. రాజధాని మార్పుపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తే సీఎం జగన్ మరోసారి జైలు వెళ్లడం తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు.
read more విశాఖకు రాజధాని అవసరమే లేదు... ఎందుకంటే...: ముప్పాళ్ల
వచ్చే శనివారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అమరావతిలో సమావేశం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మందడం నుంచి సచివాలయానికి దారిలో నివాసాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కొత్త వ్యక్తులను ఇళ్లలో వుంచవద్దని, ఒకవేళ ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలిపారు. కేబినెట్ సమావేశం ఉండటంతో ఆ రోజున నిరసనలకు అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మూడు రాజధానుల గురించి ప్రధానంగా చర్చించి, జీఎన్ రావు కమిటీ నివేదికపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే రాజధానిపై కీలక ప్రకటన ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27 ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగాల్సి వుంది. అయితే ఈ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై స్పష్టత రావడం లేదు.
ప్రస్తుత రాజధాని అమరావతిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో మంత్రివర్గ సమావేశం జరగనుందన్న ప్రచారం జరిగింది. అయితే రెండు రోజుల్లోనే ఈ సమావేశం వుండటంతో ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది.
ఈనెల 27న విశాఖలో కాకుండా వెలగపూడిలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కేబినెట్ భేటీకి అమరావతి ప్రాంతంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులకు సీఎస్ నుండి ఆదేశాలు అందాయట.