అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎట్టిపరిస్థితుల్లో అమరావతి నుండి తరలిపోకుండా అడ్డుకుంటామని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. రాజధాని శాశ్వతం కానీ సీఎం పదవి శాశ్వతం  కాదని జగన్ తో పాటు నాయకులు  గుర్తించాలని సూచించారు.

రాజధాని గ్రామం మందడంలో నిరసనకు దిగిన రైతులకు న్యాయవాదుల జేఏసీ తరఫున కనకమేడల సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనను కేంద్రం దృష్టికి  తీసుకెళ్తామన్నారు. 

read more  రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య: కన్నా

రాజధాని రైతుల ప్రస్తుత పరిస్థితిని పార్లమెంటులో సైతం ప్రస్తావించి యావత్ దేశం దృష్టిలో తీసుకెళ్తామన్నారు. రాజధాని కోసం కోర్టుల్లో కేసులు వేస్తామన్నారు.  అమరావతిలోనే రాజధాని ఉండేలా రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెద్దామని అన్నారు. రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్యగా కనమేడల అభివర్ణించారు.

అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయని... ఒక్క కలంపోటుతో రాజధానిని తరలిస్తామంటే కుదరదన్నారు. జీఎన్ రావు కమిటీకి ఏం చట్ట బద్దత ఉంది..? అని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడూ కబ్జాదారుగానే ఉన్నారని... అందుకే రైతుల బాధ అర్ధం కావడం లేదని విమర్శించారు. 

కేవలం రాజధానినే కాదు  హైకోర్టు తరలింపును  కూడా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజధానిని, హైకోర్టును తరలించేశాక అమరావతిలో ఇంకేముంటుందని నిలదీశారు.  విభజన సందర్భంలో జరిగిన నష్టం కంటే గత ఆరు నెలల వైసిపి పాలనలో ఏపీకి జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. 

read more  జగన్ ఏం చెప్పినా ఆ ఉత్తరాంధ్ర బఫూన్లు నమ్మేస్తారు: మాజీ విప్ రవికుమార్