అమరావతి: అతి భయంకరమైన కరోనా వైరస్ దేశ ప్రజలను గడగడలాడిస్తున్న సమయంలో ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఎన్నికలకు వాయిదా వేయాలని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ కి లేఖ రాశారు. 

ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందిందని... ఏపీలో ఒంగోలు, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడలలో కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు వార్తలొస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి  సమయంలో ఎన్నికల ప్రచారం, పార్టీ మీటింగ్ లు, పోలింగ్ సందర్భంగా కోసం ప్రజలు ఒకే చోట గుమిగూడతారు కాబట్టి వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం వుందన్నారు.

read more  ఆ పదవులు రాకపోవడం వల్లే మనస్తాపం..: రాజీనామాపై వైసిపి ఎమ్మెల్యే క్లారిటీ

మరోవైపు విద్యార్ధులకు ఇది పరీక్షల కాలమని... ఎన్నికల హడావుడి కారణంగా వారి ప్రిపరేషన్ కు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని అన్నారు. ఏ రకంగా చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కంటే వాయిదా వేయడమే మంచిదని రామకృష్ణ సూచించారు. 

ఇప్పటికే కరోనా భయంతో ప్రజలు రైళ్ళు, బస్సులలో ప్రయాణించాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే అభ్యర్ధుల జనసమీకరణ, ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు వంటివి పలు ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అన్నారు.  

read more  కరోనావైరస్ : హోలీ అమ్మకాలపై వైరస్ ప్రభావం

ఇంకోవైపు బీసీలకు 10 శాతం రిజర్వేషన్లలో కోత విధించడంతో ఆయా వర్గాలలో గందరగోళం నెలకొని వుందని పేర్కొన్నారు. దీనిపై బిసీ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారని... ఈ నేపధ్యంలో ఎన్నికలను కొద్ది కాలం వాయిదా వేయడం మంచిదని రామకృష్ణ ఎన్నికల కమీషనర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.