కర్నూల్: గతకొన్ని రోజులుగా కర్నూల్ జిల్లా నందికొట్కూరు రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించడమే అందుకు కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డికి మధ్య మొదలైన విబేధాలు మార్కెట్ కమిటీల పాలకవర్గాల విషయంలో తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురయిన ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆర్థర్ ఇవాళ మీడియా సమక్షంలో క్లారిటీ ఇచ్చారు. 

తన వర్గీయులకు మార్కెట్ కమిటీ పదవులు లభించకపోవడం బాధించిందని... అయితే పార్టీ అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలను శినసా వహిస్తానని అన్నారు. పదవులు రాకపోవడంతో బాధపడుతున్న వారిని సముదాయించానని... నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులెవ్వరూ పార్టీ మారబోరని స్పష్టం చేశారు. 

read more   కర్నూల్ వైసీపీలో అధిపత్య పోరు: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్

మనస్థాపంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న ప్రచారం పూర్తిగా అవాస్తమన్నారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని... స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి అత్యధిక స్థానాల్లో గెలిచి  జగన్ కు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇక కర్నూల్ ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నందికొట్కూరు వైసిపి ఇంచార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి లతో విబేధాలపై కూడా ఆర్థర్ స్పందించారు. తన అనుచరులెవ్వరూ ఇంచార్జి మంత్రి విమర్శించలేదని...బయటివారు కొందరు ఆ పని చేశారని అన్నారు. అలాగే బైరెడ్డి సిద్దార్థరెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని... కలిసి పని చేయడానికి సిద్దంగా వున్నానని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు.