జగన్ ది ప్యాక్షనిస్ట్ మనస్తత్వం... సీఎస్ బదిలీకి అదే కారణం..: అచ్చెన్నాయుడు
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆకస్మికంగా ఎందుకు బదిలీచేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అడ్డగోలుగా అధికారులను ఉపయోగించుకొని ఎంత సంపాదించారో చెప్పాల్సిన పనిలేదన్నారు.
ఈ విషయం అచ్చెన్నాయుడుగా తాను చెప్పడం లేదన్న ఆయన, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు, జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసులవిచారణలో వేసిన అఫిడవిట్ల లోనే స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఎవరైతే ఆనాడు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టారో ఆ అధికారులందరూ కూడా ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి హోదా సుబ్రహ్మణ్యం విషయంలో ఐదునెలల్లోనే ఆవిరవుతుందని తాము ఊహించలేదన్నారు. పిచ్చోడిచేతిలా రాయిలా, పిచ్చితుగ్లక్‌లా రాష్ట్రపాలన తయారైందనడానికి ఈ ఉదంతమే ఉదాహారణగా నిలుస్తుందన్నా రు. తానుచెప్పింది చెప్పినట్లుగా చేయడంలేదన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి సీఎస్‌ను అర్థంతరంగా బదిలీ చేశారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
read more హిందుత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే సీఎస్ బదిలీకి కారణమా...?: ఐవైఆర్
ముఖ్యమంత్రులుగా, ఛీప్‌సెక్రటరీలుగా ఎవరున్నా సరే బిజినెస్‌రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని మాజీమంత్రి స్పష్టంచేశారు. ఈమధ్యకాలంలో సీఎస్‌తో సంబంధంలేకుండా ముఖ్యమం త్రి ఆదేశానుసారం ఆయనదగ్గర పనిచేసే కొందరు అధికారులు కొన్నిజీవోలు జారీచేశారన్నారు. ముఖ్యమంత్రిగా తానిచ్చిన ఆదేశాలపై స్పందించే అధికారం సీఎస్‌కు ఎక్కడుందంటూ ఆయన్ని బదిలీచేయడం జరిగిందని అచ్చెన్నా యుడు స్పష్టంచేశారు.
కేబినెట్‌కు రావాల్సిన ప్రతి ఫైలుపై సీఎస్ సంతకం తప్పనిసరిగా వుండాలని కానీ అందుకు విరుద్ధంగా ఆయన సంతకం లేకుండానే కొన్నిఫైళ్లను డైరెక్ట్‌గా కేబినెట్‌కు పంపించడం జరిగిందన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరించారని... దానిపై సీఎస్‌గా సుబ్రహ్మణ్యం స్పందించినందునే అయన్ని అర్థాంతరంగా బదిలీ చేశారన్నారు.
అధికారంలోకి వచ్చిన 150రోజుల్లో అన్నింట్లో అడ్డగోలుగా వ్యవహరించడం తప్ప ప్రజలకు ఉపయోగపడేపని ఒక్కటయినా వైసీపీ ప్రభుత్వం చేయలేదని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. తాము చెప్పిందే జరగాలనేది ఫ్యాక్షన్ తత్వమని అలాంటి మనస్తత్వమున్న వారు ఎంతకైనా తెగిస్తారని... అందుకు సీఎస్ బదిలీనే పెద్ద ఉదాహరణ అన్నారు.
read more మాపై కేసులు...బిజెపి పై దాడులు...జనసేనపై విమర్శలు...: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
ఆర్డీవోస్థాయి అధికారి నిర్వర్తించే విధుల్లోకి సుబ్రహ్మణ్యాన్ని బదిలీచేయడంపై అధికారులు కూడా ఆలోచన చేయాలని టీడీపీ నేత సూచించారు. అధికారంలో ఉన్నవారు చెప్పినవాటిని పాటించకపోతే ఎవరికైనా ఈ ప్రభుత్వంలో ఇటువంటి బదిలీలు తప్పవన్నా రు. సుబ్రహ్మణ్యం వంటి అధికారి ఎక్కడా దొరకరని ఏరికోరి ప్రభుత్వంలోకి తీసుకున్న నాయకులు ఇప్పుడు ఇలా వ్యవహరించడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
నోటీసులిచ్చిన వ్యక్తిని నోటీసులు తీసుకున్న వ్యక్తి బదిలీచేశారు : బీదరవిచంద్ర
ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీకావడం పెద్దఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వప్రధాన కార్యదర్శి అనుమతిలేకుండా ఎలా జీవోలిచ్చారని... ఆయన ఎవరికైతే నోటీసుఇచ్చారో సదరు అధికారి ప్రవీణ్‌ప్రకాశ్ సంతకంతోనే రాష్ట్ర సీఎస్‌గా ఉన్నవ్యక్తి బదిలీకావడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీదరవిచంద్ర తెలిపారు. సుబ్రహ్మణ్యాన్ని గెటౌట్ అనకుండా ఒకచిన్న సంస్థకు ఆయన్ని బదిలీచేయడం చూస్తేనే ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.
ప్రభుత్వాధికారులైనా, ప్రతిపక్షనాయకులైనా, టీడీపీకార్యకర్తలైనా ప్రభుత్వానికి వ్యతిరేకులనే ముద్ర పడితే వైసీపీ ప్రభుత్వం ఒకేలా వ్యవహరిస్తుందనడానికి సీఎస్ బదిలీ సంఘటనే నిదర్శనమన్నారు.
సీఎస్ బదిలీపై బ్రాహ్మణ సంఘాలన్నీ స్పందించాలి : వేమూరి ఆనంద్‌సూర్య
ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీపై రాష్ట్రంలోని బ్రాహ్మణసంఘాలన్నీ స్పందించాలని రాష్ట్ర బ్రాహ్మణకార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత వేమూరి ఆనంద్‌సూర్య పిలుపునిచ్చారు. గతంలో టీడీపీ హాయాంలో చిన్నచిన్న విషయాలపై కూడా పెద్దఎత్తున ఖండనలు చేసిన బ్రాహ్మణసంఘాలన్నీ తక్షణమే మేల్కొని బ్రాహ్మణుడైన సుబ్రహ్మణ్యానికి జరిగిన అన్యాయంపై ఎలుగెత్తాలని ఆయన సూచించారు.
ఉపసభాపతి స్థానంలో ఉన్న కోనరఘుపతి, వైసీపీనేత మల్లాది విష్ణు, ద్రోణంరాజు శ్రీనివాస్ వంటివారు దీనిపై ఏం సమాధానం చెబుతారని వేమూరి ప్రశ్నించారు. ఎల్వీ వంటి వ్యక్తి లేడని నిన్నటిదాకా కితాబులిచ్చిన వైసీపీ నేతలు తక్షణమే ఈ బదిలీ వ్యవహారంపై స్పందించాలన్నారు. హిందూ వ్యతిరేకిగా, బ్రాహ్మణ వ్యతిరేకిగా ఉన్న వ్యక్తి ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తుంటే, ప్రభుత్వంలో, అధికారపార్టీలోని నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆనంద్ సూర్య నిలదీశారు.
సీఎస్‌ను అర్థంతరంగా బదిలీచేయడమనేది ఈ రాష్ట్రంలోనే చూశామని.... అధికారులను, వారి విధులను అస్తవ్యస్తం చేసే నిర్ణయాలు ఎల్లకాలం సాగవని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.