విజయవాడ:  తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 37ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదన్నారు. . ఇంతమందిపై అక్రమ కేసులు బనాయించి ఆస్తులు ధ్వంసం చేయలేదదన్నారు.. 

అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి కోసమే టిడిపి పాటుబడిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. గతంలో ఎప్పుడూ టిడిపి నాయకులపై, కార్యకర్తలపై ఇన్ని దాడులు, దౌర్జన్యాలు జరగలేదన్నారు. 150రోజుల్లో 622దాడులు-దౌర్జన్యాలకు పాల్పడ్డారని....8మంది ఎమ్మెల్యేలపై, 11మంది మాజీ ఎమ్మెల్యేలపై, 4గురు ఎమ్మెల్సీలపై, రాష్ట్రపార్టీ నేతలు 24మందిపై, మొత్తం 131మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

 ఎస్సీ-ఎస్టీ అట్రాసిటి కేసులు బనాయించారని.... సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.  భౌతికదాడులకు పాల్పడ్డారు, ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారని... ఇంత దుర్మార్గ పాలన గతంలో చూడలేదని తెలిపారు. 

కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు పరాకాష్టగా పేర్కొన్నారు. కోడెలపై, కుటుంబ సభ్యులపై 19కేసులు పెట్టి, అవమానాలకు గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పారని... ఫర్నిచర్ దొంగ ముద్రవేసి 409,411 సెక్షన్లు పెట్టి మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఛలో ఆత్మకూరుకు వెళ్లేందుకు నావద్దకు వచ్చిన అచ్చెన్నాయుడిపై 2చోట్ల కేసులు పెట్టారని తెలిపారు. ఆత్మకూరుకు నన్ను వెళ్లనివ్వకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారని మండిపడ్డారు. 

read more  హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్

ప్రభుత్వ బాధితుల కోసం శిబిరం 10రోజులు నడపడం ఇదే తొలిసారని... ఏదో అన్నాడని కూన రవికుమార్ పై అక్రమ కేసు పెట్టారని తెలిపారు. 40ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని...అఖిల ప్రియ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆమె భర్తపై తప్పుడు కేసులు, పలమట వెంకట రమణపై, వంశీపై తప్పుడు కేసు బనాయించారని మండిపడ్డారు. 

తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి, వేధింపులకు గురిచేసి, అవమానాలకు గురిచేసి లొంగదీసుకోవాలని చూడటం నీచ రాజకీయమన్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే దానికి ముందురోజు బాలరాజుతో రాజీనామా చేయిస్తారా...? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లపై మంత్రులు దుర్భాషలాడతారా...? అని ప్రశ్నించారు.  శ్రీకాకుళంలో బిజెపి కార్యకర్తలపై దాడులు చేశారని...ప్రశ్నించేవాళ్లను అణిచేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం మారిన తరువాత కొంత సమయం ఇద్దామని అనుకున్నామని అన్నారు. కానీ అడుగడుగునా అవినీతి, అరాచకాలు, వేధింపులు, విధ్వంసంతో రాష్ట్రం సర్వనాశనం చేస్తుండటాన్ని సహించలేకే ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాని పేర్కొన్నారు. 5నెలల్లో చేసిన తప్పుడు పనుల వల్లే అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రోడ్ల మీదకు వచ్చారని మండిపడ్డారు.

ఇసుక కొరతకు నిరసనగా ఆగస్ట్ 30న రాష్ట్రవ్యాప్త ధర్నాలు చేశానని...దానికి ముందు ఆగస్ట్ 16న అన్నా కేంటిన్ల మూసివేతకు వ్యతిరేకంగా నిరసనలు జరిపామని... అక్టోబర్ 25న కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా దీక్షలు చేశామని వివరించారు. టిడిపి కార్యకర్తలపై దాడులకు నిరసనగా సెప్టెంబర్ 19న ఛలో ఆత్మకూరు ఆందోళనలు చేశామని గుర్తుచేశారు. 

read more  జగన్ ప్రభుత్వంతో కేరళ సర్కార్ చర్చలు... ఆహ్వానించిన సీఎం పినరయి

 గుంటూరులో వైసిపి బాధితుల శిబిరం నడిపామని.. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెలపై  అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 16,17,18తేదీలలో ర్యాలీలు జరిపామని తెలిపారు. 5నెలల్లోనే రాష్ట్రంలో ఇంత దుర్భర పరిస్థితులు కల్పిస్తారని, ప్రజల్లో ఇంత అశాంతి సృష్టిస్తారని ఊహించలేదన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం రివాజు కానీ ఫిర్యాదులు ఇవ్వాలని పోలీసు అధికారులే ప్రోత్సహించడాన్ని ఏమనాలి..? దీనికి చింతమనేని ప్రభాకర్ కేసే ఒక ఉదాహరణగా చంద్రబాబు పేర్కొన్నారు. 

 బెయిల్ పై బైటకు వచ్చినప్పుడల్లా ఇంకో కేసు బనాయించి రిమాండ్ కు పంపుతున్నారని... వరుసగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కక్ష సాధింపునకు ప్రభాకర్ పై కేసులే రుజువన్నారు. ఇన్ని కేసులు పెట్టినా పార్టీ జెండాను భుజాన దించకుండా మోస్తున్న కార్యకర్తల ధైర్యసాహసాలను అభినందించాలన్నారు. వైసిపి నేతలు ఎన్ని వేధింపులకు గురిచేసినా, కేసులు పెట్టినా టిడిపి కార్యకర్తల్లో పట్టుదల రెట్టింపు అవుతోందన్నారు. 

జీవో 938ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఆ తర్వాత తనకు తెలియకుండా వచ్చిందని, క్యాన్సిల్ చేస్తామని చెప్పి తప్పించుకున్నాడని గుర్తుచేశారు.  మీడియాపై కేసులు పెట్టే అధికారం ఆయన ఒక కమిషనర్ కు అప్పగిస్తే, ఈయన(సీఎం జగన్) హెచ్ వోడిలు అందరికి అప్పగించాడని మండిపడ్డారు.

మంత్రులే మీటింగ్ పెట్టి ఎంఎస్వోలను బెదిరించారని... టివి 5, ఏబిఎన్ ప్రసారాలను నిలిపివేసి రోజుకు రూ.లక్ష జరిమానా విధించారన్నారు. జీవో 2430పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని.... దీనికి వ్యతిరేకంగా జరిగే జర్నలిస్ట్ ల ఆందోళనలకు టిడిపి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

''ఈ రోజు హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటిగా ఉందంటే, టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ఫలితమే.. రూ.2లక్షల కోట్ల సంపదను రాజధానిలో సృష్టిస్తే అంతా నాశనం చేశారు. అమరావతిలో పనులు కొనసాగిస్తే ఆదాయం పెరిగేది, అందరికీ ఉపాధి వచ్చేది, కొనుగోలు శక్తి పెరిగేది. పనులు ఆపేసి ఈ సంపద చక్రాన్ని విచ్ఛిన్నం చేశారు.

2014కు ముందు ఏపిలో ఒక్క మొబైల్ ఫోన్ తయారీ లేదు, అలాంటిది దేశంలో మూడోవంతు ఫోన్లు ఏపిలోనే తయారయ్యేలా అనేక హార్డ్ వేర్ కంపెనీలను ప్రోత్సహించాం. ప్రతి 100ఫోన్లకు 33ఫోన్లు ఏపిలోనే తయారు.కియా కార్ల తయారీ పరిశ్రమను టిడిపి తెస్తే, దాని 12 ఆగ్జిలరీ కంపెనీలను పోగొట్టారు. కియాకు ప్రోత్సాహకాలు ఎందుకివ్వాలని వైసిపి నేతలు ప్రశ్నిస్తారు..?బిఆర్ శెట్టి సంస్థను పోగొట్టారు.

రిలయన్స్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను పోగొట్టారు. ప్రకాశం జిల్లాలో రూ.25వేల కోట్ల పేపర్ ఇండస్ట్రీని రాకుండా చేశారు. అదివస్తే రామాయపట్నం పోర్టు కూడా అభివృద్ది చెందేది. రూ.70వేల కోట్ల అదాని డేటా సెంటర్-సోలార్ పార్క్ ను కుదించేశారు. లులూ కన్వెన్షన్ సెంటర్ రద్దు చేశారు.

వరల్డ్ బ్యాంకు రుణం, ఆసియన్ బ్యాంకు రుణం రూ.5వేల కోట్లు వెనక్కి పోయేలా చేశారు.పారిశ్రామిక అభివృద్దిని పూర్తిగా దెబ్బతీశారు.ఇంకా ఎవరు వస్తారు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి..? టిడిపి ప్రభుత్వం విశ్వసనీయత వల్ల రూ.16లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంవోయూలు చేసుకున్నారు. వైసిపి నిర్వాకాల కారణంగా అన్ని ఒప్పందాలు రద్దుచేసుకునే దుస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ లో టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ది చూస్తే ఒక సంతృప్తి ఉంటుంది. ఏపిలో జరుగుతోన్న విధ్వంసం చూస్తే బాధేస్తోంది.ఏపిలో పెట్టుబడుల వాతావరణాన్ని చెడగొట్టారు. ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చారు. సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది, ఉపాధి పెరుగుతుంది,కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
టిడిపి పాలనలో కరెంట్ కోతలు ఉన్నాయా..? ఇప్పుడెందుకు వచ్చాయి..? 

దోమలపై యుద్దం చేశానని అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేసిన వైసిపి నేతలు ఇప్పుడీ డెంగీ మరణాలకు ఏం సమాధానం చెబుతారు..? చిన్నారులు,వృద్దులే కాకుండా, ఇద్దరు డాక్టర్లు, పెళ్లికూతురు చనిపోయారనే వార్తలు విన్నాం.మలేరియా, డెంగీ, విష జ్వరాలు లేని ఇల్లు లేదంటే కారణం మీరు కాదా..? 5ఏళ్లలో లేని ఈ దుస్థితి ఈ 5నెలల్లోనే ఎందుకొచ్చింది..? పారిశుద్య చర్యలను మూలపడేయడం, ప్రజా చైతన్యాన్ని తప్పుపట్టాడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

150రోజుల్లో 300మంది రైతుల ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారు..? రుణమాఫీ 4వ,5వ విడత చెల్లింపులు రూ.400కోట్లు టిడిపి ప్రభుత్వం ఇస్తే, మిగిలింది వైసిపి నేతలు ఎందుకు ఎగ్గొట్టారు..? ప్రభుత్వ హామీ పత్రాలను గౌరవించాల్సిన బాధ్త్యత మీకు లేదా..? రైతు భరోసా కింద ఇస్తామన్న దాంట్లో రూ.5వేలు ప్రతి రైతుకు ఎగ్గొట్టారు.

రైతుల్లోనూ కులచిచ్చు పెట్టారు. కొన్నికులాల రైతులకే భరోసా ఇస్తామని, మిగిలిన కులాలకు ఇచ్చేది లేదని చెప్పడం ఇప్పుడే చూస్తున్నాం.పెన్షన్ నెలకు రూ.200నుంచి రూ.2వేలకు టిడిపి పెంచితే, మరో వెయ్యి పెంచుతామని చెప్పి వైసిపి కేవలం రూ.250మాత్రమే పెంచారు.వైసిపి వాళ్లనే గ్రామ వాలంటీర్లుగా, సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక చేశామని ఏ 2నిందితుడే స్వయంగా చెప్పాడు.

వైసిపి నేతల రంగుల పిచ్చి ముదిరిపోయింది.జాతీయ జెండాకే వైసిపి రంగులేసి దేశానికే అప్రదిష్ట తెచ్చారు, జాతికే తలవంపులు కలిగించారు. టిడిపి నిర్మించిన ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేశారు.ప్రభుత్వ ఆస్తులు అమ్మి సంక్షేమం చేస్తారట. దానికో మిషన్ బిల్డప్ పేరు పెట్టారు. ఎమ్మార్వో ఆఫీసులు, కలెక్టరేట్లు అమ్మేస్తారు అన్నమాట. ఆస్తులు అమ్మి సంక్షేమం చేసే దురవస్థ తెచ్చారు.

 వైసిపి ప్రభుత్వ బాధితులు అందరికీ టిడిపి అండగా ఉండాలి. న్యాయం చేసేవరకు వెన్నంటి ఉండాలి.టిడిపి కార్యకర్తల్లో నైతిక బలం మెండుగా ఉంది. గ్రామ,మండల నాయకత్వాన్ని మరింతగా ప్రోత్సహించాలి, ధైర్యంగా పోరాడేలా చేయాలి. ప్రత్యర్ధిని ధీటుగా ఎదుర్కొనే నాయకత్వం గ్రామాల్లో,మండలాల్లో రూపొందాలి.

క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని పెంచాలి. ఆత్మస్థయిర్యంగా నిలబడే భరోసా ఇవ్వాలి. కమిటిల నియామకం నామ్ కె వాస్తే చేయకూడదు. నవంబర్, డిసెంబర్ కల్లా గ్రామ మండల పార్టీ కమిటిల ఎన్నికలు పూర్తి చేయాలి. తరువాత దశల్లో జిల్లా, రాష్ట్ర కమిటిల ఎన్నికలు జరపాలి. అనుబంధ సంఘాలపై ప్రధాన దృష్టి పెట్టాలి.పార్టీలో యువ రక్తాన్ని తేవాలి. కొత్త సభ్యత్వాన్ని ప్రోత్సహించాలి.ఇకపై పార్టీలో 33%పదవులు 33ఏళ్లలోపు వారికే. మహిళా వింగ్ ను యాక్టివేట్ చేయాలి.33% పదవులు మహిళలకే కేటాయించాలి.

టిడిపికి ఉన్న ప్రధానశక్తి బిసిలే. స్థానిక సంస్థల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయ గుర్తింపు ఇచ్చింది టిడిపినే.నమ్ముకున్న వర్గాలను మళ్లీ దగ్గర చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. మాదిగలు ఎప్పుడూ టిడిపికి వెన్నంటి ఉండేవారు. వారికి పూర్తి భరోసా కల్పించాలి.పనులు చేసినా అనుసందాన లోపం వల్ల కొన్నివర్గాలు ఈ ఎన్నికల్లో పార్టీకి దూరం అయ్యాయి.

మనం చేసిన అభివృద్ది పనులను ప్రజలు ఎల్లప్పుడు గుర్తుపెట్టుకుంటారు. హైదరాబాద్ లో చేసిన టిడిపి అభివృద్ది వల్లే 2014లో కొత్తరాష్ట్రం ఏపిని పునాదులనుంచి  టిడిపి మాత్రమే నిర్మించగలదనే నమ్మకంతో గెలిపించారు.ప్రజల్లో ఎవరు చైతన్యం తేగలరు..? స్ఫూర్తి ఎవరు ఇవ్వగలరు..? వాళ్లే సమర్ధ నాయకులుగా ఎదుగుతారు. కులమత విద్వేషాలతో రాజకీయ లబ్ది పొందాలనే ధోరణి ప్రబలింది. దుష్ప్రచారం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్రలు చేశారు.

నిర్మాణంలో ఇసుకదే కీలకం. దానిపై నియంత్రణ లేకుండా ఉచితంగా ఇచ్చాం. నిరంతరం అందుబాటులో ఉంచాం. మనపై తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేశారు.
ఇప్పుడీ 5నెలల్లో వైసిపి నేతలకే ఇసుక అందుబాటులోకి తెచ్చారు. వాళ్లు ఐదారు రెట్లు అధిక రేట్లకు అమ్ముతున్నారు. కిలోల లెక్కన, బస్తాల లెక్కన ఇసుక అమ్మే దుస్థితిని ఇప్పుడే చూస్తున్నాం.

వరదల వల్ల ఇసుక ఇవ్వలేక పోతున్నామనేది నిజం కాదు. వరదలొచ్చిన ఇతర రాష్ట్రాలలో ఇసుక కొరత లేదేం..? ఏపిలోనే ఇసుక కొరత ఎందుకొచ్చింది..? గాంధీజి ఉప్పు సత్యాగ్రహాన్ని గతంలో విన్నాం. ఇప్పుడు ఇసుక సత్యాగ్రహం ఏపిలో చూస్తున్నాం. 10మంది భవన కార్మికులు ఆత్మహత్యలు బాధాకరం. 5కుటుంబాలవారికి టిడిపి నుంచి ఆర్ధిక సాయం అందించాం. ఇంకా బైటకు రాని లెక్కలు మరో 26గురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ 36మంది ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే.

‘‘కాలం చెల్లి చనిపోయారని కార్మికుల ఆత్మహత్యలను’’ మంత్రి పెద్దిరెడ్డి ఎగతాళి చేశారు.  తమ ఆత్మహత్యలకు ప్రభుత్వం సృష్టించిన ఇసుక కొరతే కారణమని సెల్ఫీ వీడియోలతో చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అవమానిస్తూ మాట్లాడే హక్కు మంత్రికి ఎవరిచ్చారు..?ఇకనైనా వెంటనే స్పందించి ఇసుక ఉచితంగా ఇవ్వండి. భవిష్యత్తులో ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించండి. ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం చెల్లించాలి. పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేలు ఆర్ధిక సాయం అందించాలి.

గత 5నెలలుగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ది పని చేపట్టలేదు. పార మట్టి వేయలేదు, యూనిట్ సిమెంట్ పనిచేయలేదు. ఇరిగేషన్ పనులన్నీ ఆపేశారు. దొంగలు పడ్డ 6నెలలకు కుక్కలు మొరిగినట్లు నీళ్లన్నీ సముద్రంలో కలిశాక, రిజర్వాయర్లు-చెరువులు నింపలేదేంటని సీఎం జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇసుక కొరత సృష్టించి, సిమెంట్ పరిశ్రమలను బెదిరించి ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. మద్యం ధరలు పెంచి ముడుపులు దండుకుంటున్నారు, వైసిపి కార్యకర్తల జేబులు నింపుతున్నారు. '' అని చంద్రబాబు అధికార పార్టీపై, ముఖ్యమంత్రి జగన్్ పై విరుచుకుపడ్డారు.