విజయవాడ: పిబ్రవరి 2వ తేధీన బిజెపి, జనసేన పార్టీలు సంయుక్తంగా భారీ కవాతు చేపట్టునున్నట్లు ప్రకటించాయి. ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఈ కవాతు నిర్వహించాలని ఇరు పార్టీలకు చెందిన కీలక నాయకులు నిర్ణయించారు. పిబ్రవరి 2న మద్యాహ్నం రెండు గంటల నుండి కవాతు  ప్రారంభం కానున్నట్లు నాయకులు వెల్లడించారు. 

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి   నిర్మల సీతారామన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఏపికి చెందిన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఇరు పార్టీల నాయకులు కలిసి విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.  

read more  మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోదు: పవన్

అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం, విలువైన, సారవంతమైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇచ్చేందుకు ఈ కవాతు చేపట్టినట్లు తెలిపారరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు వెల్లడించారు. బిజెపిలోని వివిధ స్థాయి నాయకులతో చర్చించిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన వెల్లడించింది. 

ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర  అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధార్, ఎంపి జి.వి.ఎల్.నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి  దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  తదితరులు పాల్గొన్నారు.