తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజల ముందు ఆంధ్రా ప్రజలు నవ్వులపాలు అవుతున్నారని   టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే తెలంగాణ వాళ్లు పోరాడినట్లు అలుపెరగకుండా పోరాడి అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చేయాలని... అలా జరగాలంటే రాష్ట్ర ప్రజలంతా బయటకు రావాలన్నారు. భావితరాల భవిష్యత్ కోసం పోరాడాలని సూచించారు. 

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ర్యాలీలో చంద్రబాబు  పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా ఆయన మరోసారి జోలెపట్టి విరాళాలను సేకరించారు.  ఈ ర్యాలీలో పాల్గొన్న పరిరక్షణ సమితి నాయకులు కూడా ఆయనతో  పాటే జోలెపట్టి విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు సీఎం జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించారు.

వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతుంటూ చూస్తూ వుండలేక పోరాటం చేస్తున్నానని అన్నారు. అలాంటి తనపై అమరావతి లో వున్న ఆస్తుల కోసం పోరాడుతున్నానంటూ వైసిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కుక్కను చంపాలంటూ పిచ్చికున్న అన్న ముద్ర వేసి చంపుతారని... జగన్ ఇప్పుడు అలాగే చేస్తున్నారని అన్నారు.

read more  బొత్సతో రాజధాని రైతుల సమావేశం... వాటిపైనే చర్చ

రాష్ట్రాన్ని భూతంలా పట్టి పీడించడం ఆపకుంటే ఆ యేసుప్రభువు కూడా జగన్ కు కాపాడలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడే అమరావతి, పోలవరం రెండింటినీ నాశనం చేయడమే సీఎం పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇలాంటి పనులు ఆనాడు పిచ్చి తుగ్లక్ చేస్తే మళ్లీ ఇన్నాళ్లకు ఈ పిచ్చి తుగ్లకు చేస్తున్నాడంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. 

గతంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే శ్రమించానని... అదే నేను చేసిన తప్పా అని నిలదీశారు. అసలు అమరావతి మార్చాల్సిన అవసరం ఓమొచ్చిందో చెప్పాలని నిలదీశారు. తాము  ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశామని కేవలం బురదజల్లడం కాదు... మీరే అధికారంలో వున్నారు కదా విచారణ జరిపి ఆధారాలతో బయపెట్టాలని చంద్రబాబు సవాల్ విసిరారు. కానీ ఆ సాకుతో అమరావతి నుండి రాజధానిని తరలించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.  

read more  చంద్రబాబు ట్రాప్... వారు రెడీ అయితే మేమూ రెడీనే...: కొడాలి నాని

తెలంగాణ ప్రజలు పోరాటంతో రాష్ట్రాన్ని, గాంధీజీ పోరాటంతో స్వాత్యంత్య్రాన్ని సాధించారని... ఇదే స్పూర్తితో మనం రాజధానిని కాపాడుకోడానికి పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అసలు విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారని అక్కడికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారంటూ నిలదీశారు.తాను 9ఏళ్లు ఉమ్మడి ఏపికి సీఎంగా ఉన్నానని అలాగని హైదరాబాద్‌ రాజధానిని మార్చానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కండకావరంలో విర్రవీగడం మానేసి రాష్ట్రానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు సూచిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.