అమరావతి: రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇవే కాకుండా వారికి ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.  రైతులకు సంబంధించిన ఎలాంటి అంశాన్నయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

రాజధాని ప్రాంతంలోని రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు శనివారం ఉదయం మంత్రిని విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షల కారణంగా ఇంట్లో పెళ్లిల్లు, ఇతరత్రా అవసరాలకు భూములను అమ్మలేక పోతున్నామని... ఫలితంగా ఆర్ధికపరమైన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా రైతులు మంత్రికి వివరించారు. 

read more  చంద్రబాబు ట్రాప్... వారు రెడీ అయితే మేమూ రెడీనే...: కొడాలి నాని

అంతేకాకుండా లంక ప్రాంతాల్లోని భూముల సమస్యలను కూడా వారు మంత్రివద్ద ప్రస్తావించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఆ సమావేశంలో అసైన్డ్‌ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రైతులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాలన్నింటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

అభివృద్ధి పనులకు వినియోగించని తమ భూములను తిరిగి ఇచ్చే ఆలోచన చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలన్నింటిని  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని మంత్రి బొత్స సత్యనారాయణ వారికి హామీ ఇచ్చారు.