అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నష్టం కలిగేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజధాని రైతులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తామని... అలాకాకుండా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ట్రాప్ లో పడవద్దని నాని సూచించారు. 

ఆందోళన చేస్తున్న అమరావతి ప్రజలు మరీ ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్దంగా వుందని నాని వెల్లడించారు. అందుకోసం రైతులు ముందడుగు వేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.  ముఖ్యంగా తమ భూముల రేట్లు పడిపోతాయేమోనని ఆందోళన రైతుల్లో ఉందని... దాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై కూడా చర్చిండానికి తాము సిద్ధమేనని మంత్రి తెలిపారు. 

read more  ఉత్తరాంధ్ర దెబ్బకు చంద్రబాబు విలవిల...ఇది అసలైన...: తమ్మినేని

అమరావతి రైతులకు అన్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని... వివిధ కమిటీల సూచనల మేరకే రాజధాని మార్పుపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి సిద్దమే కాని వివిధ పార్టీలు చేపడుతున్న అనవసర నిరసనలకు తలొగ్గే ప్రసక్తే లేదని స్ఫష్టం చేశారు. 

ఈనెల  20వ తేధీన ఏపి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని... రాజధాని విషయంలో ఆరోజు పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అప్పటివరకు రైతులతో పాటు అమరావతి ప్రాంత ప్రజలు సంయమనంతో వుండాలని సూచించారు. ప్రతిపక్షాల రాజకీయాల్లో భాగం కావద్దని కొడాలి నాని సూచించారు.