Asianet News TeluguAsianet News Telugu

కుప్పం పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు... నాయకులతో చంద్రబాబు భేటీ

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై ఆయన సొంత నియోజకవర్గంలోనే పోలీస్ కేసు నమోదయ్యింది.  

chandrababu naidu meeting with kuppam tdp leaders
Author
Tirupati, First Published Dec 25, 2019, 8:34 PM IST

చిత్తూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని అన్ని పంచాయితీలు, మండలాలు, వార్డులలో టిడిపి ఘన విజయం సాధించాలని... అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ కుప్పం నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి  నిరూపించాలని కోరారు. 

టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు బుధవారం కుప్పం నియోజకవర్గ నేతలతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి వారితో చర్చించారు. ఈ ఎన్నికల్లో యువతను మరింతగా ప్రోత్సహించాలని... పార్టీ ఎన్నికల్లో ఇప్పటికే యువతకు 33% పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. 

మహిళలకు 33%, బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50% పదవులు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని... బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 

పార్టీ నాయకుల విబేధాలు వదిలేయాలి... ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పంచాయితీలో, వార్డులో పార్టీ బలోపేతం కావాలన్నారు. పార్టీ మీద నమ్మకం, నాయకత్వం మీద విశ్వాసంతోనే వరుసగా గత 7 పర్యాయాలు అత్యధిక మెజారిటితో కుప్పంలో గెలిపిస్తున్నానని... అందుకే కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఒక నమూనాగా చేశానన్నారు. 

read more  గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

''కుప్పం మోడల్ అనేది అభివృద్దిలో ఒక ప్రామాణికంగా మారింది.  టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది పనులపై ప్రజల్లో చర్చ జరగాలి. ఇప్పటి వైసిపి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పనులను అడ్డుకుంటుందో ప్రజలకు వివరించాలి. వెనుకబడిన మారుమూల ప్రాంతం కుప్పంలో రూ.2,500కోట్లతో అభివృద్ది పనులు చేశాం. ప్రతిగ్రామానికి సిసి రోడ్లు, బిటి రోడ్లు, తాగునీటి సరఫరా, అంగన్ వాడి, పంచాయితీ, పాఠశాలల భవనాలు, డిగ్రీ కళాశాల నిర్మాణం చేశాం'' అని వివరించారు.

''టిడిపి హయాంలో  హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను చిత్తూరు జిల్లా చివరి ఊరిదాకా తేవాలని సంకల్పంగా పెట్టుకున్నాం. పిటిఎం ట్యాంక్ కు నీరు విడుదల చేశాం. పుంగనూరుకు నీళ్లిచ్చాం. పలమనేరు వరకు నీళ్లొచ్చాయి. కుప్పం దాకా నీటిని తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 97% పనులన్నీ పూర్తి చేశామని మిగతా 3% పనులను చేయకుండా వైసిపి ప్రభుత్వం గత 7నెలలుగా నీరుగార్చారు. వైసిపి అధికారంలోకి వచ్చాక అన్ని పనులను నిలిపేశారు. 

ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క యూనిట్ కాంక్రీట్ వేయలేదు. విమానాశ్రయం పనులు ఆపేశారు.కుప్పం నుంచి అమరావతికి రావడమే దూరాభారం అయితే ఇప్పుడు విశాఖ రాజధాని అంటున్నారు. దీనివల్ల ఇక్కడి ప్రజల విలువైన కాలం వృధా కావడమే కాకుండా ధనవ్యయం, మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు వస్తాయి. గత 7నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఆ రాయితో ఎదుటివాడిని కొట్టడం, లేక తన నెత్తిమీదే కొట్టుకోవడం చేస్తున్నారు. 

15ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నడూ ఇన్ని ఇబ్బందులు పార్టీకి ఎవరూ కల్పించలేదు. రాజశేఖర రెడ్డి హయాంలోనూ ఇన్ని ఇబ్బందులు లేవు. వైసిపి నాయకుల ఇష్టారాజ్యంగా మారింది పరిపాలన.  అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలు పెట్టారు. ఉల్లిపాయల ధరలు, నిత్యావసర వస్తువుల రేట్లు విచ్చలవిడిగా పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. దళారుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. 

భూములు కబ్జాలు చేస్తున్నారు. 270 మందిపైగా రైతుల ఆత్మహత్యలు, 60మంది కార్మికుల ఆత్మహత్యలు, వందలాదిమంది ఆత్మహత్యాయత్నాలు జరిగాయి. వీళ్లందరి సమస్యలను ఎత్తిచూపే  మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఛానళ్లను బ్యాన్ చేశారు, పేపర్లపై కక్ష సాధిస్తున్నారు. 

అసెంబ్లీలో పేదల సమస్యలను ఎండగట్టామనే అక్కసుతో టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. గతంలో రాజకీయాల్లో హుందాతనం ఉండేది. గౌరవంగా వ్యవహరించేవారు. ఇప్పుడీ వైసిపి వచ్చాక అవన్నీ గాలికి వదిలేశారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారు. 7నెలల్లో ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం, పార్టీ దేశంలో మరెక్కడా లేదు'' అని వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. 

read more  అలా చేస్తే జగన్‌ మరోసారి జైలుకే: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

''కుప్పంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని వైఎస్సార్ సుజలగా మార్చడం, రంగులు మార్చి కార్డులు కూడా వేరేగా ఇవ్వడం గర్హనీయం. కేంద్రమంత్రి ప్రశంసలు పొందిన ఈ పథకాన్ని అనేక గ్రామాల్లో నిలిపేయడం బాధాకరం. గ్రామాల్లో చెత్త తొలగించడం లేదు.  వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను గాలికి వదిలేశారు. వీధి దీపాలు మాడి పోయినా పట్టించుకున్నవారు లేరు.

 ప్రజా సేవ గాలికి వదిలేశారు, రౌడీ దందాలు చేస్తున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూముల కబ్జాలు, వేధింపులు, దౌర్జన్యాలు పెరిగాయి. వైసిపి రౌడీల బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. అందరూ ఐకమత్యంగా పనిచేయాలని'' అని చంద్రబాబు కోరారు. 

కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుంచి టిడిపి నాయకులు ఈ భేటికి హాజరయ్యారు. చంద్రబాబు కనబడటం లేదని కుప్పం పోలీస్ స్టేషన్ లో కొందరు వైసిపి నేతలు తప్పుడు ఫిర్యాదు చేయడంపై టిడిపి కుప్పం నియోజకవర్గ నాయకులు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షునిగా, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పట్ల తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎప్పటికప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడే చంద్రబాబుపై ఇటువంటి ఫిర్యాదు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios