డబ్బు మీద ఆశ జనాన్ని ఎంతకైనా తెగించేలా చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించారు. పలమనేరు మండలం దొడ్డిపల్లులో కొందరు గుప్తనిధుల కోసం గణేశ్ అనే యువకుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.

అయితే ప్లాన్ బెడిసికొట్టడంతో వారు ఆ యువకుడిపై యాసిడ్ దాడి చేశారు. కాలిన గాయాలతో గణేశ్ ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:గుప్త నిధుల వేటలో పట్టుబడిన టీఆర్ఎస్ నేత: దేవీ విగ్రహాన్ని పెకిలించి...

కొద్దిరోజుల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాల జరిపిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత పి. తిరుమలేష్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల్లో హైదరాబాదులోని బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు తిరుమలేష్ నాయుడిని నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. 

ఆలయంలోని భ్రమరాంబికా విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. తిరుమలేష్ నాయుడికి సహకరించిన ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు దడైర్వర్ షహబాజ్ అలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాటు వేసిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తున్న ముఠాను పట్టుకున్నారు. 

చెంచులు, గిరిజనులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వల పన్ని ఆ ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా ఈ నెల 8వ తేదీన అడవిలోకి ప్రవేశించి రెక్కీ నిర్వహించి తిరిగి సోమవారం సాయంత్రం అడవిలోకి వెళ్లి రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తేలింది. 

Also Read:కర్నూలులో కలకలం: గుప్త నిధుల కోసం నరబలి...?

పెద్ద నోట్ల రద్దు రద్దు సమయంలో కూడా తిరుమలేష్ నాయుడు కరెన్సీ మారుస్తానని చెప్పి ఓ ఇన్ స్పెక్టర్ తో చేతులు కలిపి బెదిరించిన కేసులో జైలు పాలై బెయిల్ పై బయటకు వచ్చాడు. కొద్ది రోజులకే నార్ిసంగ్ లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో రివాల్వర్ తో బెదిరించిన ఘటనలో కూడా జైలుకు వెళ్లి వచ్చాడు. 

ఈ రెండు కేసులను పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి పోలీసులకు మరోసారి చిక్కాడు. గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్న తిరుమలేష్ నాయుడు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరాడు. హైదరాబాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ టీఆర్ఎస్ నేతకు అతను అనుచరుడని తెలుస్తోంది.