చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. తవణంపల్లె మండలం సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్‌ బోల్తాపడటంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. తవణంపల్లె మండలం మోదులపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ట్రాక్టర్‌పై సిద్దేశ్వరకొండపైనున్న సిద్ధేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు.

స్వామి దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఘాట్‌రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనేవున్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Also Read:చెప్పినా వినలేదు, వైసీపీకి ఓట్లేసి కుంపటి పెట్టుకొన్నారు: చంద్రబాబు

మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బుధవారం నాడే కర్నూలు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్ సమీపంలోని ఐటీసీ కంపెనీ వద్ద వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన తీరు చాలా భయానకంగా ఉందని.. స్థానికులు చెబుతున్నారు. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో అది మరోక ఆటోను, రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. వెంటనే స్పందించిన స్ధానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మరణించారు.

Also read:సంతకాలు చేయమంటే చేశాను.. పెత్తనమంతా శ్రీధర్‌దే: రాయపాటి సాంబశివరావు

కృష్ణానగర్ ఐటీసీ జంక్షన్ వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం శూన్యం. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది.