ట్రాన్స్‌ట్రాయ్‌లో అవకతవకలకు సంబంధించిన తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గతంలో తన భార్య డైరెక్టర్‌గా వ్యవహరించేవారని.. ఆమె చనిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్‌కు ఇద్దరి సంతకాలు కావాలని ఈ క్రమంలో తాను డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నానని ఆయన తెలిపారు.

తాను ఎప్పుడూ ట్రాన్స్‌ట్రాయ్ ఆఫీసుకు వెళ్లలేదని.. బ్యాలెన్స్ షీట్‌పై సంతకం చేయమంటే చేశానని రాయపాటి తేల్చిచెప్పారు. ఆ సంస్థ రోజువారీ కార్యకలాపాలకు తాను ఎలాంటి సంబంధాలు లేవని, మొత్తం వ్యవహారాలను సీఈవో చూసుకుంటున్నారని సాంబశివరావు తెలిపారు.

15 ఏళ్ల క్రితం తానే కంపెనీనీ స్థాపించి, ప్రమోటర్‌గా వ్యవహరించి అనంతరం శ్రీధర్‌కు అప్పగించినట్లు రాయపాటి వెల్లడించారు. తక్కువ కాలంలోనే చెరుకూరి శ్రీధర్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడని సాంబశివరావు తెలిపారు.

Also Read:మాజీ ఎంపీ రాయపాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

వ్యాపార వ్యవహారాల కోసం కొన్ని బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. హైదరాబాద్ రోడ్ నెం.10లో ఉన్న కంపెనీ బిల్డింగ్‌ మెట్రో విస్తరణలో పోయిందని, అలాగే ఔటర్ రింగ్ రోడ్‌ సమయంలోనూ తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావాల్సి ఉందని రాయపాటి తెలిపారు.

కంపెనీ ప్రస్తుతం నష్టాల్లో ఉందని.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు తనను ఇరికించారని రాయపాటి ఆరోపించారు. 

మంగళవారం ఉదయం హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరులలో రాయపాటికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు రాయపాటిపై కేసులు నమోదు చేశారు.

సాంబశివరావుకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థలోనూ సోదాలు చేసిన సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న రాయపాటి సకాలంలో తిరిగి చెల్లించలేదు.

Also Read:షాక్ :మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇల్లు, ఆపీసుల్లో సీబీఐ సోదాలు

14 బ్యాంకులను ట్రాన్స్‌ట్రాయ్ తప్పుదారి పట్టించిందని యూనియన్ బ్యాంక్ తన ఆడిట్‌లో తేలింది. మొత్తం రూ.3,226 కోట్ల నిధులను ట్రాన్స్‌ట్రాయ్ డైవర్ట్ చేసినట్లుగా తేలింది. అలాగే రూ.794 కోట్లను రైటప్ చేసినట్లు యూనియన్ బ్యాంక్ గుర్తించింది.

రూ.2,298 కోట్ల రూపాయల స్టాక్ ఓవర్ వేల్యూవేషన్ చేయించడంతో పాటు సదరు నిధులను సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు నిధులు మళ్లీంచినట్లుగా తెలిసింది. ఈ 14 బ్యాంకులు తెలియకుండా ట్రాన్స్‌ట్రాయ్ గోల్ మాల్ చేసినట్లు తెలుస్తోంది.

రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయాల్లో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఆయనపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్‌ 13(2), రెడ్‌ విత్‌ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసులను నిందితులుగా పేర్కొన్నారు.