అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే చాలామంది ఈ పేస్టును బయట కొనుగోలు చేస్తుంటారు. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కెమికల్స్, నాసిరకం పదార్థాలు ఉండచ్చు. కాబట్టి కొనే ముందు కొన్ని విషయాలు గమనించాలి.  

చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కి కొన్ని పదార్థాలు ఇంట్లో తయారు చేసుకునేందుకు టైం ఉండదు. మరికొందరికి కొన్ని పదార్థాలు తయారుచేయడం తెలియక బయట కొనుగోలు చేస్తుంటారు. అలా బయట కొనే వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. ఈ పేస్టును బయట కొంటే టైం ఆదా అవుతుందని అనుకుంటారు చాలామంది. కానీ ఆ పేస్ట్ ఆరోగ్యానికి మంచిదా? కాదా.. అని ఎప్పుడైనా ఆలోచించారా?

రెడీమెడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు కొంటారంటే?

  • ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలామందికి అల్లం వెల్లుల్లి తరగడానికి టైం ఉండదు.
  • రెడీమేడ్ పేస్ట్ వంట తేలిక చేస్తుంది.
  • కూరలు, పులుసు, గ్రేవీ అన్నింటికీ ఉపయోగపడుతుంది.
  • కొంతమందికి సరైన మోతాదులో అల్లం వెల్లుల్లి తరగడం తెలియదు.

బయట కొనే పేస్ట్‌లో ఏముంటుంది?

చాలా పేస్ట్‌లలో కెమికల్స్ కలుపుతారు. ఇవి పేస్ట్ చెడిపోకుండా, రంగు మారకుండా ఉంచుతాయి. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకోవడం ముఖ్యం. 

పేస్ట్ చెడిపోకుండా కలిపే పదార్థాలు:

సోడియం బెంజోయేట్: ఇది పేస్ట్ ను చెడిపోకుండా ఉంచుతుంది. కానీ, ఎక్కువైతే, ముఖ్యంగా విటమిన్ సితో కలిస్తే, బెంజీన్ అనే ప్రమాదకర పదార్థం వస్తుంది. బెంజీన్ క్యాన్సర్‌కి కారణం అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, FSSAI ఒక లిమిట్ వరకు దీన్ని అనుమతిస్తుంది.

పొటాషియం సోర్బేట్: ఇది ఫంగస్ రాకుండా ఉంచుతుంది. సాధారణంగా సేఫే అనుకుంటారు. కానీ ఎక్కువైతే కొంతమందికి అలెర్జీలు రావచ్చు.

టైటానియం డై ఆక్సైడ్: కొన్ని పేస్ట్‌లు తెల్లగా, మెరుస్తూ ఉండడానికి దీన్ని కలుపుతారు. ఇది రంగులు, ప్లాస్టిక్‌లో కూడా వాడతారు. ఇది DNAని దెబ్బతీస్తుంది. పేగుల్లో మంచి బాక్టీరియాని చంపుతుంది. పేగుల గోడలను దెబ్బతీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. FSSAI దీన్ని ఆహార పదార్థాల్లో వాడటం నిషేధించింది.

కృత్రిమ రంగులు, వాసనలు: పేస్ట్ ఫ్రెష్‌గా ఆకర్షణీయంగా కనిపించడానికి కృత్రిమ రంగులు కలుపుతారు. ఇవి 'E' కోడ్స్‌తో లేబుల్‌పై ఉంటాయి (ఉదా: E102, E110). ఇవి పిల్లల్లో ADHD లాంటి సమస్యలు తెస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నాసిరకం పదార్థాలు:

కొంతమంది చెడిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ చేస్తారు. ఇందులో ఫంగస్, బాక్టీరియా చేరుతాయి.

చెడిపోయిన పదార్థాలను దాచడానికి, పిండి, సాక్ పౌడర్, ఎక్కువ ఉప్పు, నూనె కలుపుతారు. ఇది ఆహారం నాణ్యతను దెబ్బతీస్తుంది.

బయట కొనే పేస్ట్‌ మంచిదో, కాదో ఎలా గుర్తించాలి?

రంగు: మామూలు పేస్ట్ లేత పసుపు లేదా లేత బ్రౌన్‌ కలర్ లో ఉంటుంది. తెల్లగా, మెరుస్తూ, లేదా వింత రంగుల్లో ఉంటే అది కల్తీదో, చెడిపోయిందో కావచ్చు.

వాసన: ఫ్రెష్ పేస్ట్‌కి కారం వాసన ఉంటుంది. పుల్లని వాసన, కెమికల్ వాసన, లేదా వింత వాసన ఉంటే తీసుకోకపోవడం మంచిది.

పదార్థం: పేస్ట్ మృదువుగా ఉండాలి. చిక్కగా, నీళ్లలాగా, లేదా విడిపోయి ఉంటే అది నాసిరకమని గుర్తించాలి.

ధర: చాలా తక్కువ ధరకు దొరికితే అనుమానించాలి. మంచి పదార్థాలతో చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది.

లేబుల్ చదవండి: కొనే ముందు లేబుల్ చదవండి. ఏం కలిపారో తెలుసుకోండి. "ఎక్కువ ప్రిజర్వేటివ్స్" లేదా "కృత్రిమ రంగులు" అని ఉంటే వద్దు. FSSAI నెంబర్.. తయారీ తేదీ, గడువు తేదీ చూసుకోండి.

ఆరోగ్య సమస్యలు:

వెంటనే వచ్చేవి: కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, తలనొప్పి, అలెర్జీలు (చర్మంపై దురద, వాపు) రావచ్చు.

దీర్ఘకాలిక సమస్యలు: కల్తీ, కెమికల్ ఆహారం తింటే.. లివర్, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు, శరీరంలో విష పదార్థాలు పెరగడం, ADHD, కొన్ని క్యాన్సర్లు రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రత్యామ్నాయాలు:

  • ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని.. తొక్క తీసి, కడిగి, 1:1 లేదా 1:2 (అల్లం:వెల్లుల్లి) నిష్పత్తిలో తీసుకోండి. 
  • మిక్సీలో కొంచెం నూనె (2-3 స్పూన్లు), కొంచెం ఉప్పు వేసి తరిగిన ముక్కలను వేయండి. నీళ్లు వేయద్దు. లేదా చాలా తక్కువ వేయండి. నీళ్లు వేస్తే త్వరగా చెడిపోతుంది.
  • కొంచెం వెనిగర్ (1 స్పూన్) వేస్తే, రంగు మారకుండా, చెడిపోకుండా ఉంటుంది.

ఫ్రిజ్‌లో పెట్టచ్చు: మెత్తగా చేసిన ఈ పేస్ట్‌ని గాజు సీసాలో నింపి.. ఫ్రిజ్‌లో పెట్టండి. 2-3 వారాలు చెడిపోదు. వాడేటప్పుడు శుభ్రమైన చెంచా వాడండి.

బయట కొనుక్కునే పేస్ట్ ఈజీ అయినా.. కెమికల్స్, తయారీ గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి.. ఇంట్లోనే ఫ్రెష్‌గా తయారుచేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.