జహిరాబాద్...నిజాంల కాలంలో దక్కన్ ప్రాంతంగా పిలవబడిన ఈ ప్రాంతం ఎర్రనేలలకు ప్రత్యేకం. రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో నిజాం, కర్ణాటక సరిహద్దులో ఉండటంతో కన్నడ, మహారాష్ట్ర కూడా సమీపంలోనే ఉండటంతో మరాఠా సంస్కృతులతో ఓ మినీ దక్షిణ భారతాన్ని తలపిస్తుంది. ఇలా  సంస్కృతులోనే కాదు రాజకీయాల్లో కూడా జహీరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మంచి వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చెందుతున్న ఈ ప్రాంతం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 

ఈ నియోజకర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతోంది. ఒక్కసారి మినహాయిస్తే మిగతా  అన్ని ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీదే ఇక్కడ విజయం. ముఖ్యంగా దివంగత బాగారెడ్డి ఇక్కడి రాజకీయాలను దాదాపు 40 ఏళ్లపాటు శాసించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా  32 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి బాగారెడ్డి రికార్డు సృష్టించాడు. ఈయన హయాంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యింది. 

జహీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బాగారెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అలాగే మెదక్ ఎంపిగా కూడా గెలిచి కేంద్ర రాజకీయాల్లోను తన వంతు పాత్ర వహించాడు. ఇలా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు బాగారెడ్డి. ఇలాంటి నాయకున్ని అందించిన ఘనత జహిరాబాద్ కే దక్కుతుంది. 

 జహిరాబాద్ నియోజకవర్గం 1957 లో ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌సి నుండి  పోటీ చేసిన బాగారెడ్డి సమీప ప్రత్యర్థి నరేంద్ర దత్ పై 9799 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తర్వాత వరుసగా 1985 ఎన్నికల వరకు బాగారెడ్డి హవా కొనసాగింది. ఇలా అతడు వరుసగా ఏడుసార్లు జహిరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పటికి ఆయన  రికార్డే కొనసాగుతోంది. జానారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా  గెలిచి ఆయన తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ 32  ఏళ్ల కాలంలోనే బాగారెడ్డి పలు శాఖలకు మంత్రిగా  కూడా పనిచేశారు. ఆ తర్వాత 1989 నుండి 1998 వరకు ఐదుసార్లు ఎంపీగా పోటీచేసి పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. 

ఇక ఆయన తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో జహిరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింహా రెడ్డి ఫోటీ చేసి టిడిపి అభ్యర్థి దశరథ్ రెడ్డిని ఓడించాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన సీ బాగన్న కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహరెడ్డిపై 34వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించి జహిరాబాద్ చరిత్రలో మొదటి కాంగ్రెసేతర ఎమ్మెల్యేగా స్థానం సంపాదించుకున్నాడు. 

 ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంది. 1999లో జరిగిన ఎన్నికల్లో బాగారెడ్డి అనుచరుడు, మైనారిటీ  నేత పరిదుద్దిన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన  2004 ఎన్నికల్లో మళ్లీ ఆయనే ఎమ్మెుల్యేగా గెలిచి వెఎస్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నాడు. 

ఇక 2009లో జహీరాబాద్ అసెంబ్లీ జనరల్ నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో అప్పటివరకు గజ్వెల్ నుండి ఫోటీ చేసిన గీతారెడ్డి  జహిరాబాద్ కు షిప్ట్ అయ్యారు.  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఈమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సరోత్తమ్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కూడా 2014 లో కూడా గీతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మానిక్ రావుపై గెలుపొందారు.  2014 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 8 చోట్ల టీఆర్ఎస్  విజయడంకా మోగించగా రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో ఒకటి  జహిరాబాద్.

అయితే ఈ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన పరిదుద్దిన్ తో పాటు చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద చూపించి పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. దీంతో జహిరాబాద్‌లో రానున్న ఎన్నికల్లో గెలుపెవరిదో అన్ని దానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.  

 

మరిన్ని స్పెషల్ స్టోరీస్ 

సిద్దిపేట సరళి: మామను మించిన అల్లుడు

కేసీఆర్ ఇలాకాలో గతంలో కాంగ్రెస్‌దే హవా