IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IMD Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు… తెలంగాణలో చలిగాలుల బీభత్సం కొనసాగుతోంది. ఈ వర్షాలకు ఇప్పుడు పిడుగులు కూడా తోడై మరింత ప్రమాదకరంగా మారతాయని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో పిడుగుపాట్లు...
Weather Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ తుపాను బలహీనపడి వాయుగుండంగా, అల్పపీడనంగా మారినతర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ వర్షాలకు పిడుగులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రేపు (డిసెంబర్ 5, శుక్రవారం) ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో భారీ వర్షాలు
ఇవాళ (డిసెంబర్ 4, గురువారం) ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా చిట్టమూరులో 88.5మిల్లిమీటర్లు, చింతవరంలో 81మిమీ, నెల్లూరులో 61మిమీ, పాలూరులో 60మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణపై చలి పంజా
తెలంగాణ విషయానికి వస్తే వర్షాలు లేవుకానీ చలితీవ్రత విపరీతంగా ఉంది... ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నల్గొండ 16, మెదక్ 16.6, రామగుండం 16.8, నిజామాబాద్ లో 17.4, హన్మకొండ 18 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హయత్ నగర్ లో అత్యల్పంగా 17, రాజేంద్ర నగర్ లో 18 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తమిళనాడులో భారీ వర్షాలు
ప్రస్తుతం తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చెరి, కారైకల్ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, చెన్నై, నీలగిరి, కోయంబత్తూరు, తూత్తుకుడి సహా 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు వర్షాలుంటాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

