సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ... అంతకుముందు ఆయన సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుండి  పలు దఫాలు విజయం సాధించారు.


సిద్దిపేట: సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ... అంతకుముందు ఆయన సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు విజయం సాధించారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇండిపెండెంట్‌గా ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఈ స్థానం నుండి విజయం సాధించారు. 

టీడీపీకి గుడ్‌బై చెప్పి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి కూడ కేసీఆర్ రాజీనామా చేశారు.తాను టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. 2004 తర్వాత సిద్దిపేట స్థానాన్ని కేసీఆర్ తన మేనల్లుడు హరీష్‌రావుకు అప్పగించాడు. హరీష్ రావు ఈ అసెంబ్లీ స్థానంనుండి ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకొంటూ వస్తున్నాడు.

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి హేమా హేమీలు ప్రాతినిథ్యం వహించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ స్థానంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో పీడీఎప్ అభ్యర్థి (ఆనాడు కమ్యూనిష్టులపై నిషేధం ఉండడంతో పిడీఎఫ్ పేరుతో పోటీ చేశారు) గురువా రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి.వి. రాజేశ్వరరావుపై 15066 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

పీడీఎప్ అభ్యర్ధి గురువారెడ్డికి 22077 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 7011 ఓట్లు మాత్రమే లభించాయి. 1957లో సీన్ మారింది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పి.వి. రాజేశ్వరరావు విజయం సాధించారు. పి.వి. రాజేశ్వరరావుకు 16,909 ఓట్లు లభిస్తే, పీడీఎప్ అభ్యర్థి గురువారెడ్డికి 13269 ఓట్లు మాత్రమే వచ్చాయి. 3640 ఓట్ల మెజారిటీతో పి.వి. రాజేశ్వరరావు విజయం సాధించారు.

1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమేశ్వరరావుకు (18320) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పి.వి. రాజేశ్వరరావుకు 16827 ఓట్లు మాత్రమే దక్కాయి.1427 ఓట్లతో సోమేశ్వరరావు విజయం సాధించారు. 1967లో సీపీఐ అభ్యర్థి గురువారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వీబీ రాజు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వీబీ రాజుకు 24238 ఓట్లు లభించాయి. సీపీఐ అభ్యర్థి గురువారరెడ్డికి కేవలం 12995 ఓట్లు మాత్రమే దక్కాయి.

1970లో సిద్దిపేట స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి మదన్‌మోహన్ (31619) కు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రాజేశ్వరరావుకు 11562 ఓట్లు వచ్చాయి. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మదన్‌మోహన్‌కు 27437 ఓట్లు వచ్చాయి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్వీ రావుకు 10286 ఓట్లు దక్కాయి.

1978లో కాంగ్రెస్ ఐ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌మోహన్ విజయం సాధించారు. ఆయనకు ఈ ఎన్నికల్లో 32729 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టి. మహేందర్ రెడ్డికి 11254 ఓట్లు మాత్రమే దక్కాయి.

1983లో జరిగిన ఎన్నికల్లో మదన్ మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. మదన్ మోహన్ కు ఈ ఎన్నికల్లో మదన్‌మోహన్‌కు 28766 ఓట్లు వస్తే, కేసీఆర్‌‌కు 27889 మాత్రమే వచ్చాయి.1985 లో తొలిసారిగా ఈ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌కు 45215 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డికి 29059 ఓట్లు మాత్రమే వచ్చాయి.

1989లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌కు 53145 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ కు 39329 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1994లో మరోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేసీఆర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు 64645 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ కు 37538 ఓట్లు మాత్రమే వచ్చాయి.

1999లో కూడ ఈ స్థానం నుండి కేసీఆర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు 69169 ఓట్లు వస్తే... కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి చరణ్‌కు 41614 ఓట్లు వచ్చాయి. 2001లో కేసీఆర్ టీడీపీని వీడాడు.2001 ఏప్రిల్ 21న కేసీఆర్ టీఆర్ఎస్‌ ను ఏర్పాటు చేశాడు. కేసీఆర్ ఆ సమయంలో ఇండిపెండెంట్‌గా ఈ స్థానం నుండి పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు 82632 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి కె.శ్రీనివాసరెడ్డికి 23920 ఓట్లు మాత్రమే వచ్చాయి.

2004లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంతో పాటు సిద్దిపేట అసెంబ్లీ నుండి కేసీఆర్ పోటీ చేశారు. సిద్దిపేట నుండి పోటీ చేసిన కేసీఆర్ కు 74287 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి జిల్లా శ్రీనివాస్ కు కేవలం 29619 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇదిలా ఉంటే కరీంనగర్ పార్లమెంట్ నుండి ప్రాతినిథ్యం వహిస్తూ సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. దీంతో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తొలిసారిగా సిద్దిపేట నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు 64,374 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి పోటీ చేస్తే ఆయనకు 39547 ఓట్లు వచ్చాయి.

2008 జరిగిన ఉప ఎన్నికల్లో కూడ హరీష్ రావు విజయం సాధించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో హరీష్ రావు మరోసారి విజయం సాధించారు. హరీష్ రావుకు 200ల9లో 85847 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి బైరి అంజయ్యకు 21166 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

2014 ఎన్నికల్లో హరీష్ రావు మరోసారి విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో హరీష్ రావుకు 108699 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్ కు 15371 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మరోసారి సిద్దిపేట నుండి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. మహాకూటమి తరపున ఎవరూ ఈ స్థానం నుండి బరిలోకి దిగుతారోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.