భయంతోనే నన్ను అడ్డుకుంటున్నారు: గజ్వేల్ కు వెళ్లకుండా హౌస్ అరెస్ట్‌ చేయడంపై షర్మిల

గజ్వేల్ కు వెళ్లేందుకు తనకు భద్రత ఇవ్వాలని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పోలీసులను  కోరారు. గజ్వేల్ లో ఎంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారో చెప్పాలని ఆమె కోరారు.

YSRTP Chief YS Sharmila Urges police to give permission to her for going to Gajwel lns

హైదరాబాద్: తన పోరాటాలకు ప్రజల నుండి మద్దతు వస్తుందనే భయంతో కేసీఆర్ సర్కార్ పోలీసులతో  తనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందని  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.శుక్రవారంనాడు  లోటస్ పాండ్ వద్ద  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల  మీడియాతో మాట్లాడారు. తాను గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై  ఆమె మండిపడ్డారు. తాను గజ్వేల్ పర్యటనను అడ్డుకుంటామని  బీఆర్ఎస్ నేతలు ప్రకటించడాన్ని ఆమె తప్పుబట్టారు. బీఆర్ఎస్ నేతలు తన పర్యటనను అడ్డుకుంటామని  చెబితే వారిని అదుపులోకి తీసుకోకుండా తనను అడ్డుకోవడం ఏమిటని  వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

అయితే  బీఆర్ఎస్ నేతలను  కూడ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబితే  ఎంతమందిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం  వైఎస్‌ఆర్‌టీపీని  ఏర్పాటు చేసి 3,600 కి.మీ. పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎత్తి చూపేందుకు  తాను పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.ప్రజలకు సమస్యలు లేవా అని  ఆమె అడిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తున్నారా అని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు.దళితబంధును ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తే తాము ఆందోళనలు చేయాల్సిన అవసరమే లేదన్నారు.

నిరుద్యోగులకు  40 రోజులకు పైగా  తాను  నిరసన దీక్షలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు  చేశారు.  ఈ దీక్షలు చేస్తే తనను జైల్లో పెట్టారన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి తనకు వినతి పత్రం వచ్చిన విషయాన్ని షర్మిల మీడియాకు చూపారు. తీగుల్ గ్రామ ప్రజలను కలిసేందుకు  వెళ్లకపోతే తాము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్టని  ఆమె ప్రశ్నించారు.

also read:లోటస్ పాండ్ వద్ద ఆసక్తికర సన్నివేశం: పోలీసులకు హరతి ఇచ్చిన వైఎస్ షర్మిల

తన నియోజకవర్గ ప్రజలు  ఇబ్బందులు పడుతుంటే  సీఎం ఎందుకు  పోలేదో  చెప్పాలన్నారు. విపక్షాలకు  సంబంధించి నేతలను కూడ గజ్వేల్ కు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.తాను ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.తన చేతిని ఎందుకు  పట్టుకున్నారని  ఓ మహిళ పోలీస్ ను  షర్మిల నిలదీశారు. పోలీసులు  కేసీఆర్ కోసం పని చేయడం మానుకోవాలని ఆమె  కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios