లోటస్ పాండ్ వద్ద ఆసక్తికర సన్నివేశం: పోలీసులకు హరతి ఇచ్చిన వైఎస్ షర్మిల
లోటస్ పాండ్ నుండి గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు.
హైదరాబాద్: గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారంనాడు హౌస్ అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుండి షర్మిల బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ కు వచ్చిన పోలీసులకు వైఎస్ షర్మిల హారతి ఇచ్చారు.గతంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో షర్మిల పోలీసులను నెట్టివేసిన విషయం తెలిసిందే.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో పోలీసులతో షర్మిల వాగ్వావాదానికి దిగారు. షర్మిలకు అడ్డుపడిన పోలీసులను ఆమె నెట్టివేశారు. ఈ విషయమై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. షర్మిలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వైఎస్ షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ ప్రయత్నించారు. అయితే విజయమ్మను కూడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. పోలీసులపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన ఆ సమయంలో కలకలం చోటు చేసుకుంది.
also read:కారణమిదీ: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
అయితే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలోని దళిత బంధు పథకంలో అవకతవకలపై తీగుల్ గ్రామానికి వెళ్లేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆమెను లోటస్ పాండ్ వద్దే అడ్డుకున్నారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకోవద్దని ఆమె పోలీసులను కోరారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులకు ఆమె హారతి ఇచ్చారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారిని ఇలానే అడ్డుకోవాలని ఆమె సెటైర్లు వేశారు. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో లోటస్ పాండ్ లోనే ఆమె బైఠాయించి నిరసనకు దిగింది.ఈ కేసులో అరెస్టైన వైఎస్ షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుండి బయటకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన పట్ల వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ని నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సమయంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు వైఎస్ షర్మిల వాహనానికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చి వదిలిపెట్టారు. అయితే తన వాహనాలతో ప్రగతి భవన్ వైపు వెళ్తున్న షర్మిలను పోలీసులు పంజాగుట్ట వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో కూడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో పోలీసులతో ఘర్షణ పూరిత వాతావరణం షర్మిల కొనసాగించింది. కానీ దానికి భిన్నంగా ఇవాళ వ్యవహరించారు.