బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం ఆరుగురు ఏడుగురు మహిళలకు మాత్రమే చోటు కల్పించడంపై స్పందిస్తూ ఎమ్మెల్సీ కవితపై సెటైర్లు విసిరారు షర్మిల. 

హైదరాబాద్ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు సీఎం కేసీఆర్. అయితే బిఆర్ఎస్ అధినేత ఈసారి కూడా చాలా తక్కువ మంది మహిళలకు సీట్లు కేటాయించారు. దీంతో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కొందరు టార్గెట్ చేస్తున్నారు. సొంత పార్టీలో మహిళలకు న్యాయం జరిగేలా చూడలేని కవిత మహిళా రిజర్వేషన్లు అంటూ డిల్లీలో పోరాడటం రాజకీయ, వ్యక్తిగత స్వార్థం కోసమేనని ఆరోపిస్తున్నారు. ఇలా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కవితపై సెటైర్లు విసిరారు. 

 చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కవిత డిల్లీలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. కానీ కవిత డిల్లీలో దొంగదీక్షలు చేయడం కాదు ముందు రాష్ట్రంలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కేలా చూడాలని వైఎస్ షర్మిల సూచించారు. మహిళల రిజర్వేషన్ల సాధనకు చిత్తశుద్ధితో పోరాడే పార్టీలు తమతో కలిసి రావాలని చిలక పలుకులు పలుకిన కవితమ్మ... ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? అని నిలదీసారు. బీఆర్ఎస్ పార్టీ 115 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది.... ఇందులో కేవలం 7 స్థానాలు మాత్రమే మహిళలకు కేటాయించారు... ఇదేనా మీ చిత్తశుద్ది? అని కవితను షర్మిల నిలదీసారు. 

మహిళలు ఆకాశంలో, అధికారంలో సగం అంటూ శ్రీరంగ నీతులు చెప్పడం కాదు... ఆ మాటలను నిజం చేయాలని షర్మిల అన్నారు. అంతేగానీ కేవలం 6 శాతం సీట్లకే వారిని పరిమితం చేయడం సరికాదన్నారు. మహిళకు 33శాతం సీట్లు కేటాయించాలంటూ దమ్ముండాలని... ఆ దమ్ము బిఆర్ఎస్ పార్టీకి లేదని అర్థమయ్యిందన్నారు. కాబట్టి కవిత మహిళా రిజర్వేషన్ల కోసం అక్కడెక్కడో డిల్లీలో కాదు హైదరాబాద్ లో పోరాడాలని కవిత సూచించారు. 

Read More మహిళా రిజర్వేషన్ బిల్లు .. వెకిలిగా మాట్లాడటం రేవంత్‌కు సాధ్యం, కాంగ్రెస్ నుంచి ఒక్కరైనా వచ్చారా : కవిత

తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నారు... కానీ వారికి రాజకీయాల్లో ఆ స్థాయిలో అవకాశాలు దక్కడం లేదని షర్మిల అన్నారు. కాబట్టి లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మహిళల గురించి కవిత ఆలోచిస్తే మంచిదన్నారు. మీ నాన్న కేసీఆర్ తో మాట్లాడి క్యాబినెట్, పెద్దల సభలో మహిళలను తగిన స్థానం దక్కేలా చూడాలని... నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలని షర్మిల సూచించారు.

లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకే కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల నినాదం ఎత్తుకున్నారని షర్మిల ఆరోపించారు. తాను బయటపడేందుకు ఆడిన నాటకం తప్ప మహిళల పట్ల కవితకు చిత్తశుద్ది ఎక్కడిదన్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలన్నారు. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు కేటాయించేలా చేసి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని షర్మిల అన్నారు. 

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించిన పాపాన పోలేదని కవితపై షర్మిల సీరియస్ అయ్యారు. రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, అర్ధరాత్రి మహిళను స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదని అన్నారు. మహిళలంటే మీ దృష్టిలో వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు... రాజకీయాలకు కాదు అంటూ కవితపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.