వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిత తన పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నట్టుగా చెప్పారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిత తన పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నట్టుగా చెప్పారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తాను తెలంగాణలో 3,800 కి.మీ పాదయాత్రను పూర్తి చేశానని తెలిపారు.
అయితే ఆ పాదయాత్రను తిరిగి కొనసాగిస్తానని షర్మిల ప్రకటించారు. ఈ నెలలోనే పాలేరులోనే పాదయాత్రను ప్రారంభించి.. 4 వేల కి.మీ దాటిన తర్వాత పాలేరులోనే యాత్రను ముగిస్తానని చెప్పారు. పాలేరులో ప్రతి గడపకు సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక, రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరులోనే పోటీ చేస్తానని.. ఇందులో ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదని ఇప్పటికే షర్మిల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే ప్రచారం సాగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: వైఎస్సార్ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులు.. వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..
ఇదిలా ఉంటే, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు.
