వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేయనున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేయనున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూల వైఖరిని కనబరుస్తూ వైఎస్ షర్మిల స్పందిస్తుండటం ఆ ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. తాజాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ట్విట్టర్ వేదికగా.. ఆయనకు నివాళులర్పించారు. ‘‘కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఆయన ఎల్లప్పుడూ స్మరించబడాలి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన వైఎస్ షర్మిల.. ‘‘డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర‌రెడ్డి అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ ఆప్యాయతతో కూడిన మాటలకు ధన్యవాదాలు. మీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్సార్. ఆయన సంక్షేమం నమూనా నేటికీ దేశవ్యాప్తంగా దేశమంతటా ప్రాధాన్యమైన పాలనా నమూనాగా ఉంది. డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ధన్యవాదాలు సర్’’ అని రాహుల్ ట్వీట్‌కు షర్మిల రిప్లై ఇచ్చారు. 

Scroll to load tweet…


ఇదిలా ఉంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు.