తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ టిపి అధినేేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు.
హైదరాబాద్ :నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఏకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ క్వశ్చన్ పేపర్లనే లీక్ చేసిన వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. అంతేకాదు ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్ పిఎస్సి బోర్డును వెంటనే రద్దుచేయాలని షర్మిల డిమాండ్ చేసారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో టీఎస్ పిఎస్సి పేపర్ లీక్, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష,వామపక్ష,విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ... రాజకీయాలు,సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలకోసం పోరాడటం మనందరి నైతిక భాధ్యత అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను కాపాడేందుకు 'టీ సేవ్ ఫోరం' ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫోరం ద్వారా ఉద్యోగాలు,విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్,హాస్టళ్లలో వసతులు తదితర అంశాల మీద పోరాటం చేస్తామన్నారు.
Read More కేసీఆర్ ఓ దద్దమ్మ... కేటీఆర్ పరమ దరిద్రుడు, సన్నాసి..: అద్దంకి దయాకర్
తెలంగాణలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు తర్వాత దాదాపు 3.85లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని షర్మిల అన్నారు. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిందని గుర్తుచేసారు. కేసీఅర్ మాత్రం అసెంబ్లీలో నిలబడి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండేళ్ల క్రితం చెప్పారు... కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని అన్నారు.
నిరుద్యోగుల పక్షాన నిలబడి కేసీఅర్ మెడలు వంచాల్సిన అవసరం అందరిపైనా వుందని షర్మిల అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు షర్మిల తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి సచివాలయ ముట్టడికి పిలుపు ఇద్దామన్నారు. 1.91 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. మండలానికి ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుతో పాటు ప్రతి నిరుద్యోగికి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. 10 లక్షల మంది యువతకి కార్పొరేషన్ తరపున లోన్లు వెంటనే విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేసారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువతకి బీజేపీ సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. తెలంగాణకు భాకీ పడిన ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని... 20 లక్షల మంది విద్యార్థులకు 5 వేల కోట్లు తక్షణం చెల్లించాలని కోరారు. టీఎస్ పిఎస్సి మీద నమ్మకం పోయింది కాబట్టి వేరే బోర్డ్ వేసి తక్షణం నియామకాలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేసారు.
