తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ :తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక దరిద్రుడు, సన్నాసి అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతమైన ఐటీ మంత్రిగా వుండి టీఎస్ పిఎస్సి పేపర్ లీకేజీతో తనకేం సంబంధం అంటావా కేటీఆర్? అని నిలదీసారు. నీలాంటి పనికిమాలిన, పరమ చెత్త మంత్రిని నేనెక్కడా చూడలేదంటూ దయాకర్ మండిపడ్డారు. 

హైదరాబాద్ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ తో పాటు విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్ టిపి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల కోసం రాజకీయాలను పక్కనపెట్టి నాయకులంతా ఒక్కటవ్వాలని అన్నారు. అందరం కలిసి నిరుద్యోగుల పక్షాన పోరాడదామని... వేదిక ఏదైనా కలిసికట్టుగా కార్యాచరణ ప్రకటించాలని అన్నారు. 

రాష్ట్రంలో రెండు కోట్ల మంది యువత ఉంది... వీరిలో 30 లక్షల మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా వున్నారని దయాకర్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ ఒక్కో గ్రామంలో ఆరేడు బెల్ట్ షాపులు ఉన్నాయంటూ ఎద్దేవా చేసారు. కేసీఆర్ కుటుంబం గల్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ వ్యాపారం చేస్తోందంటూ అద్దంకి దయాకర్ ఆరోపించారు. 

Read More ప్రశాంత్ నాకు టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం పంపలేదు: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ

ప్రభుత్వం చెప్పినట్లు తెలంగాణలో 1.91 లక్షల ఉద్యోగాలు కాదు 2.20లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని దయాకర్ తెలిపారు. కేసీఅర్ ఒక దమ్ములేని ముఖ్యమంత్రి... ఒక్క ఉద్యోగం కూడా పెంచలేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ శాఖలో చూసినా ఉద్యోగాల కొరత ఉందన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను కేవలం 2 లక్షల కోట్లతో దివంగత వైఎస్సార్ నడిపించారు... మరి ఇప్పుడు కేవలం తెలంగాణకే 4 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు కానీ ఆ స్థాయి పాలన సాగడంలేదన్నారు. తెలంగాణ కుంభకోణాలు, భూ కబ్జాలకు కేంద్రంగా మారిందని దయాకర్ ఆరోపించారు. 

సిద్ధాంతం పరంగా కమ్యునిస్ట్ పార్టీలు దొరకు వ్యతిరేకంగా పోరాడాలి... కానీ తెలంగాణలో దొరకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తున్నాయి అని ఆరోపించారు. తమ్మినేని వీరభద్రం కు విద్యార్థుల రోదన కనపడటం లేదా..? అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో దేశం మొత్తం ఖర్చు కేసీఆరే భరిస్తానని అంటున్నాడట... ఎక్కడ నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు? అని ప్రశ్నించారు. 

ఇక ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ... మార్కెట్ లో టీఎస్ పిఎస్సి పేపర్లను పల్లి బఠాణీ అమ్మినట్టు అమ్ముతున్నారని అన్నారు. బయటకు వచ్చే వరకు అది టీఎస్ పిఎస్సి పేపర్ అని తెలియదన్నారు. ఓవైపు పేపర్ లీకేజీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇంకా దర్యాప్తు సాగిస్తూనే వుంది... కేటీఆర్ మాత్రం దోషులెవరో ప్రకటించారని అన్నారు. -. సిట్ దర్యాప్తులో తెలియని దోషులు కేటీఆర్ కి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. 

టీఎస్ పిఎస్సిలో ఇంత పెద్ద తప్పు జరిగితే ఒక్క కనీసం చర్యలు లేవు... నైతిక బాధ్యతగా అయినా బోర్డ్ ను రద్దు చేయలేదని వెంకట్ అన్నారు. సిట్ దర్యాప్తు మొత్తం దారి మళ్లిందని... దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయాల ప్రయోజనం కోసం పేపర్ లీక్ స్కాం పక్కకు నెడుతున్నారని అన్నారు. కేసీఅర్ కుటుంబ పాలన పై కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బల్మూరి వెంకట్ అన్నారు.