భర్తతో గొడవపడి అతడి మెడకు చున్నీ బిగించి హత్య చేసిందో భార్య. నేరం రుజువు కావడంతో ఆమెకు జీవితఖైదు పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : 2021 మార్చిలో తన భర్త మహ్మద్ సోహైల్‌ను హత్య చేసిన కేసులో నిందితురాలైన 27 ఏళ్ల రేష్మా బేగం దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి ఏడవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఇంఛార్జి) జై కుమార్ బుధవారం నాడు తీర్పు చెప్పారు. తన భర్తను చంపిన తర్వాత, రేష్మ మృతదేహం పక్కన కూర్చున్న దృశ్యాన్ని మీడియా వ్యక్తి వీడియో తీసి పోలీసులకు నివేదించారు.
విచారణ సమయంలో, అతని వాంగ్మూలం కూడా రికార్డ్ చేయబడింది. అతనిని కూడా పరిశీలించారు. కోర్టు ముందు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అతను రికార్డ్ చేసిన వీడియో క్లిప్ కూడా ఫోరెన్సిక్స్ సైన్స్ లాబొరేటరీ ద్వారా ప్రామాణికమైనదిగా ధృవీకరించబడింది. అతడు అందించిన ఆధారాలతో పాటు ఫోరెన్సిక్ నివేదిక, ఇతర సాక్ష్యాలను బట్టి, కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధించిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ తెలిపారు.
ఆ దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హత్య జరిగిన రోజు మద్యం సేవించి గొడవ పడి, ఆమె చున్నీతో అతని గొంతు బిగించింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విచారణ ముగిసిన అనంతరం కోర్టు ఆమెకు శిక్షను ఖరారు చేసింది.
ఢిల్లీలోనే బండి , ఈటల మకాం: జూపల్లి సహా ముగ్గురు నేతల చేరికపై హైకమాండ్‌తో చర్చలు
ఇదిలా ఉండగా, జనవరిలో ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. భర్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ భార్య ఏకంగా అతడిని హతమార్చింది. ప్రమాదవశాత్తు మరణించాడని కథ అల్లింది. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని ఆశపడి ఈ పని చేసిందని పోలీసుల విచారణలో తేలడంతో అరెస్ట్ అయి జైలు పాలయింది. భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. అందుకే అతడిని హతమార్చినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర బోయిన శ్రీనివాస్ (50), భార్య సీతామహాలక్ష్మి (43)తో కలిసి ఉంటున్నాడు. కొత్తగూడెం కలెక్టరేట్ లో అటెండర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నాడు. డిసెంబర్ 30 ఉదయం తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ ను కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రిలో సీతా మహాలక్ష్మి జాయిన్ చేసింది. డిసెంబర్ 29న అర్థరాత్రి శ్రీనివాస్ వంటింట్లో కాలు జారిపడ్డాడని..దీంతో తలకు తీవ్ర గాయమైంది అని చెప్పింది. జిల్లా ఆస్పత్రిలో వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ రెండు, మూడు గంటల్లోనే శ్రీనివాస్ మరణించాడు.
అయితే వీరికి సాయికుమార్ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత.. భార్య సీతామహాలక్ష్మి కనిపించకుండాపోయింది. దీంతో అనుమానంపై ఆమెపై నిఘా పెట్టారు. ఈ మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
