హైద్రాబాద్ పేట్ల బురుజు ఆసుపత్రిలో కు.ని. శస్త్రచికిత్స ఆపరేషన్ ఫెయిల్: మహిళ మృతి

హైద్రాబాద్ నగరంలోని పేట్ల బురుజు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది.మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె  మరణించింది. 

Woman Dies After Family Planning Surgery  in Hyderabad

హైదరాబాద్: నగరంలోని పేట్లబురుజు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది. పేట్లబురుజు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మహిళ అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్థానిక వైద్యుల సూచన మేరకు బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని ప్రముఖ తెలుగు న్యూస్  చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఇటీవలనే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది ఆగష్టు 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. శస్త్ర చికిత్స  చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందారు.మూడు రోజుల వ్యవధిలో నలుగురు మహిళలు మృతి చెందారు.

ఆగష్టు 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, రాజీవ్ నగర్ తండాకు చెందిన మౌనిక,  మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపల్లికి చెందిన  లావణ్య లు  కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత ఈ నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మహిళలను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆగస్టు 28న మమత ఆగస్టు 29న  సుష్మ,  ఆగస్టు 30న  లావణ్య, మౌనికలు  చనిపోయారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో  కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ కమిటీ  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో విచారణ నిర్వహించింది.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించిన డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.ఈ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న 30 మంది మహిళలకు హైద్రాబాద్ అపోలో,  నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఆసుపత్రిలో చికిత్ప పొందిన తర్వాత మహిళలు కోలుకున్నారు.ఈ రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన మహిళలను గవర్నర్  తమిళిసై సౌందర రాజన్, మంత్రి హరీష్ రావు, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు పరామర్శించారు.కుటుంబ నియంత్రణ శస్త్రచికత్సలు చేసిన సమయంలో ఇన్ ఫెక్షన్ సోకడంతో మహిళలు మృతి చెందినట్టుగా వైద్య శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. 

also read:ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాలి: నిమ్స్‌లో కు.ని. బాధితులకు తమిళిసై పరామర్శ

వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నలుగురు మహిళల మృతిపై నివేదికను ఇవ్వనుంది. మరో వైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఒక్క రోజు ఒక్క డాక్టర్ 10 రోజులు శస్త్రచికిత్సలు చేయవద్దని కూడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

వైరల్ ఫీవర్ వల్లే మహిళ మృతి: డీఎంఈ

పేట్ల బురుజు ఆసుపత్రిలో మహిళ మృతిపై వైద్య శాఖ అధికారులు స్పందించారు.మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయలేదు, సిజేరియన్ చేశామని  డీఎంఈ రమేష్ రెడ్డి ప్రకటించారు.  వైరల్ ఫీవర్ వల్లే మహిళ మృతి చెందిందని రమేష్ రెడ్డి వివరించారు.  మహిళ మృతికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కారణం కాదని ఆయన ప్రకటించారు.  మరణించిన మహిళకు ఆపరేషన్ చేసిన రోజునే 9 సర్జరీలు చేసినట్టుగా డీఎంఈ వివరించారని ప్రముఖ తెీలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ  కథనం ప్్రసారం చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios