గతేడాది వెటర్నరీ వైద్యురాలు దిశ సామూహిక అత్యాచారానికి గురై.. ఆ తర్వాత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేశారు. ఈ ఘటన జరిగి నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఎవరూ మర్చిపోలేదు. కాగా.. అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు మరోటి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Also Read దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి...

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. కాగా... యువతి శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో మోది హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో.. అత్యాచారం చేసి హత్య  చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. యువతికి సంబంధించిన వస్తువులు కానీ.. దుస్తులు కానీ సంఘటనా స్థలంలో దొరకక పోవడం గమనార్హం. దీంతో సదరు యువతి ఎవరూ అన్న విషయం తెలియడం లేదు. హత్యకు గురైన యువతిది ఏ ప్రాంతమో తెలిస్తే.. నిందితులు ఎవరో గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. యువతి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా గుర్తించారు. యువతిపై వేరే ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడి అనంతరం ఇక్కడకు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.