పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో సామాన్యులందరూ  మోదీకి దూరమైపోయారు.  కానీ, కేసీఆర్ మాత్రం చాలా దగ్గరై పోయారు.

 

ఎన్నికల ముందు మోదీ లేడు గీడీ లేడు అన్న కేసీఆర్ ... ఇప్పుడు మోదీనే ఇండియా... ఇండియానే మోదీ అనే స్థాయికి వెళ్లిపోయారు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎందుకో మరి కారు రూట్ మారింది. సరాసరి కమలం వైపే చూస్తోంది. కమలం కాస్త కరుణిస్తే అలా కేంద్ర మంత్రివర్గంలో కూడా కారు షికారు చేయోచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే అందులో నిజామాబాద్ ఎంపీ కవితక్క కు బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. కె.కేశవరావు,  జితేందర్‌రెడ్డిలు కూడా మంత్రి వర్గ రేసులో ఉన్నారనేది మరో టాక్. అయితే వీరందరిలో మొదటి ప్రాధాన్యత మాత్రం కేసీఆర్ కూతురికే.

 

ఎన్డీయే మిత్ర పక్షాలు కూడా పెద్ద నోట్ల రద్దు తర్వాత మోదీపై కారాలు మిరియాలు నూరుతుంటే కేసీఆర్ మాత్రం ప్రధానిపై పన్నీరు జల్లుతున్నారు.  

 

సీఎం ఇలా సడెన్ గా ప్లేటు ఫిరాయించడానికి కారణం కేంద్ర మంత్రివర్గంలో  టీఆర్ ఎస్ జెండా పాతడానికే అనేది చాలా మంది చెబుతున్న కారణం.

 

పెద్ద నోట్ల రద్దు ప్రకటనను మొదట్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన సీఎం ఆ తర్వాత మాట మార్చడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది.

 

పాపం.. ఈ తరుణంలో ఎటొచ్చి ఇబ్బంది పడుతున్నంది రాష్ట్ర బీజేపీ నేతలే. తమ అధినేతను తమకంటే బాగా పొగుడుతున్న కేసీఆర్ ను ఆయన పాలనను ఇక ఏమాత్రం విమర్శించలేని పరిస్థితి వారిది.

 

అందుకే ఇక్కడి బీజేపీ నేతలందరూ అసెంబ్లీ లో కూడా మౌనవ్రతమే పాటిస్తున్నారు. ఇక రేపు కేంద్ర మంత్రివర్గంలో కూడా టీఆర్ ఎస్ చేరితే బీజేపీ నేతలు పూర్తిస్థాయిలో మౌనవ్రతం పాటించడానికి సిద్ధంగా ఉండాలి.