Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం.. రైతు వేదన దీక్షలో వైఎస్ షర్మిల వార్నింగ్

రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాల్సిందేనని, లేదంటే కేసీఆర్ తల వంచి కొనేంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ధర్నా చౌక్ దగ్గర రైతు వేదన నిరాహార దీక్ష తర్వాత ఆమె మాట్లాడుతూ కేసీఆర్ మూడు వారాల గడువు ఇస్తున్నట్టు చెప్పారు. ఇంతలోపు వడ్లు కొనకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
 

will sit indefinite hunger strike if telangana govt not procure paddy
Author
Hyderabad, First Published Nov 13, 2021, 7:17 PM IST

హైదరాబాద్: వరి పంటను కొనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నగరంలో ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్(Dharna Chowk) వద్ద  వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) నిరసన చేసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ YS Sharmila సారథ్యంలో రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 5.40 గంటలకు నిరాహార దీక్ష ముగించిన తర్వాత వైఎస్ షర్మిల మాట్లాడారు. CM KCRకు మూడు వారాల సమయం ఇస్తున్నామని, ఇంతలోపే వరి పంట కొనుగోలు చేయాలని అన్నారు. లేదంటే తాము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని వివరించారు.

శుక్రవారం నిరాహార దీక్ష చేయాలనుకున్నామని వైఎస్ షర్మిల వివరించారు. కానీ, తమ పార్టీకి ఈ అనుమతులు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారని అన్నారు. దీంతో నిరాహార దీక్ష శనివారం మొదలుపెట్టామని చెప్పారు. 72 గంటలపాటు రైతు వేదన నిరాహార దీక్షకు తాము ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. కానీ, ధర్నా చౌక్ వద్ద సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారని, దీంతో లోటస్ పాండ్‌లో మిగిలిన 48 గంటల రైతు వేదన నిరాహార దీక్ష చేయానుకున్నామని వివరించారు. కానీ, అక్కడ కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, స్టేజీ వేస్తే తీసేస్తున్నారని చెప్పారు. తానంటే కేసీఆర్‌కు ఎందుకు అంత ఉలికిపాటు అని ప్రశ్నించారు.

Also Read: YS Sharmila: రైతు నోట్లో సున్నం కొడుతున్నారు.. టీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలి..కేసీఆర్‌పై షర్మిల ఫైర్

తెలంగాణలో పోలీసులు జులుం నడుస్తున్నదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాలన చేతకకా కేసీఆర్ ధర్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌కు వరి కొనడం చేతకాలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మాటలు చెప్పే మొనగాళ్లే.. కానీ, పూటకు బత్యం ఇచ్చయే పుణ్యాత్ములు మాత్రం కారని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక అధికార పక్షమే ధర్నాలు చేస్తున్నదని అన్నారు. 

కేసీఆర్‌కు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదని, రుణ మాఫీ చేయడం చేతకాలేదని, ఇంటికో ఉద్యోగం చేతకాలేదని, నిరుద్యోగ భృతి చేతకాలేదని, కేజీ టూ పీజీ విద్య అందించడం కూడా చేతకాలేదని మండిపడ్డారు. హామీలను కూడా నిలబెట్టుకోలేని కేసీఆర్ వాటిపై కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేయాలని ఎద్దేవా చేశారు. లేదంటే.. ఆయన సీఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రైతుల గురించి కేసీఆర్ ఆలోచించడం లేదని, లక్షల ఎకరాల్లో వరి వేసిన రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ఆలోచించడం లేదని చెప్పారు.

Also Read: 'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '

రైతుల పక్షాన పోరాడుతుంటే తమను కూడా ఆపాలని సీఎం చూస్తున్నారని, కానీ, ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరని వైఎస్ షర్మిల అన్నారు. నిరుద్యోగులు, రైతులు, రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తరిమికొట్టే సమయం దగ్గర పడిందని తెలిపారు. మూడు వారాల్లో కేసీఆర్ వరి పంటను కొనుగోలు చేయకుంటే తమ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్ష వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న ఆయన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ మెడలు వంచి కొనేంత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆగదని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios