Asianet News TeluguAsianet News Telugu

YS Sharmila: రైతు నోట్లో సున్నం కొడుతున్నారు.. టీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో ధర్నాలు చేయాలి..కేసీఆర్‌పై షర్మిల ఫైర్

తెలంగాణపై కేంద్రం పెత్తనం ఏందీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వరి ధాన్యం తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల(YS Sharmila) రైతు వేదన(raithu vedana) దీక్ష చేపట్టారు.

YSRTP Chief ys sharmila fires on kcr in raithu vedana deeksha
Author
Hyderabad, First Published Nov 13, 2021, 4:07 PM IST

తెలంగాణపై కేంద్రం పెత్తనం ఏందీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. ఇప్పుడు కేంద్రం మీద నిందలు ఎందుకు మోపుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వరి ధాన్యం తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల(YS Sharmila) రైతు వేదన(raithu vedana) దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై విమర్శల వర్షం కురించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలుపై ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ రైతన్న నోట్లో మాత్రం సున్నం పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వైఖరి వల్ల రైతులు పండించిన వరిని ఎక్కడ పడితే అక్క ఆరేసుకుంటూ తిప్పలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

ఆ వరి కుప్పలపై ముగ్గురు రైతులు చనిపోయినా.. దున్నపోతు మీద వాన పడినట్లుగా కేసీఆర్‌లో ఏ మాత్రం చలనం లేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అసలు వడ్లు ఎందుకు కొనడం లేదని.. కొనడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని షర్మిల ప్రశ్నించారు. వచ్చే యాసంగిలో కేంద్రం బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ కొంటామన్న విషయాన్ని ముందు తెచ్చి.. వానా కాలం వడ్లు కొనే బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. వానా కాలంలో ఎఫ్‌సీఐ 40 లక్షల టన్నులు కొనడానికి సిద్దంగా ఉన్నప్పుడు.. కేసీఆర్ ఎందుకు వడ్లు కొనడం లేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలను ఎందుకు తరవడం లేదని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ఏజెంట్‌గా మారారని విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. వరి వేసుకుంటే.. ఉరి వేసుకున్నట్టే అని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబితే కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నారని.. సంతకాలు ఎందుకు పెట్టారని అడుగుతున్నామని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నాలు చేయాలని.. ఆంక్షలు పెట్టిన రోజే ఢిల్లీలో ధర్నాలు, ప్రెస్ మీట్లు పెట్టి ఉండాల్సిందన్నారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఎవరిని ఉద్దరించినట్టు అని విమర్శించారు. దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేసి.. కేంద్రం వైఖరిని ఎండగట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతులకు మద్దతు ధర కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని షర్మిల ప్రశ్నించారు. 

YSRTP Chief ys sharmila fires on kcr in raithu vedana deeksha

‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మందికి రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్ లాంటివి తీసుకొచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ ఇన్ పుట్, విత్తనాల సబ్సిడీ, పంట భీమా కూడా వైఎస్సార్ ఇచ్చారు.  పెట్టుబడిని తగ్గించి రాబడిని పెంచారు. అందుకే కదా ఆ రోజు రైతు రాజు అయ్యింది. కానీ ప్రస్తుతం కేసీఆర్ వడ్లు కొనడం చేతగాక ధర్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చారు. ఆ రోజు మద్దతు ధర 500 రూపాయలు అయితే 20 శాతం బోనస్ 100 రూపాయలు ఇచ్చి వైఎస్సార్ కొనలేదా అని అడుగుతున్నాం’ అని షర్మిల అన్నారు. 

Also read: YS Sharmila deeksha: ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ప్రారంభం

రైతులకు మద్దతు ధర కూడా ఎందుకు కేసీఆర్ ఇవ్వలేక పోతున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, చతీస్ గడ్ , కేరళలలో మద్దతు ధరతో పాటు ధాన్యాన్ని బోనస్ ఇచ్చి కొంటున్నారు. మద్దతు ధర మీద భోనస్ ఇచ్చి పక్క రాష్ట్రాలు రైతులను అదుకుంటుంటే...కేసీఆర్ బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం..?. వైఎస్సార్ సన్న బియ్యానికి 300 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేశారు. సన్న బియ్యానికి ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే సన్న బియ్యం పంట రైతు చేతికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఉత్పత్తి తక్కువగా వస్తుందని ఆయన ఆలోచన చేసి ఎక్కువ ధరకు బియ్యం తీసుకున్నారు. 

సన్నబియ్యం, దొడ్డు బియ్యానికి ఈ రోజు దాదాపు అదే ధర పలుకుతోంది. ఇదేనా పాలకులు రైతుల గురించి ఆలోచిస్తోంది. మద్దతు ధర అంటే అర్థం ఏమిటి..? రైతు పండించిన పంటకు కనీస ధర మేము ఇస్తామని ప్రభుత్వం నమ్మకం ఇవ్వడమే మద్దతు ధర. అలాంటప్పుడు వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ఎందుకు కొనుగోలు చేయకపోవడం లేదు..? రైతుకు పంట పండించడం వరకే ఆయన బాధ్యత. ఆ తర్వాత పంటను కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత. కొనుగోలు చేసిన ఆ ధాన్యాన్ని ఎలా వాడుకోవాలన్నది మీ ఇష్టం. అలా కాకుండా భారం మొత్తం రైతుల మీద మోపుతున్నారు. ఇది సమంజసమేనా అని అడుగుతున్నాం’అని షర్మిల ప్రశ్నించారు.

తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఒక ఇండిపెండెంట్ అసోసియేషన్ గానే ఉండాలన్నారు. మిలర్లను కేసీఆర్ ఆయన పార్టీలో చేర్చుకని.. వారికి మేలు చేసి.. రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ము, దైర్యం ఉంటే సివిల్ సప్లైయ్ ఆడిట్ రిపోర్ట్ బయట పెట్టాలని సవాల్ విసిరారు. కేంద్రం వరి కొనేందుకు, నిల్వ ఉంచేందుకు, అమ్మేందకు, వాహనాల్లో తరలింపునకు, హమాలీలకు కూడా కేంద్రం నిధులు ఇస్తోంది.. మరి కేసీఆర్ దేనికి నిధులు ఖర్చు చేస్తున్నాడని ప్రశ్నించారు. 

బంగారు తెలంగాణ అని చెప్పి, బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారన విమర్శించారు. నియంత్రణ వరి మీద పెట్టాలా.? మధ్యం మీద పెట్టాలా..? అని ప్రశ్నించారు. ఈరోజు డ్రగ్స్ తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా దొరుకుతున్నాయని చెప్పుకొచ్చారు. లక్షల మంది తెలుపు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారని.. వారికి కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సగానికి పైగా మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలని అనుకన్న టీఆర్ఎస్‌కు ఇదే వేదిక దిక్కైందని.. సిగ్గుండాలి కదా అని ప్రశ్నించారు. 

రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 లక్షల మందికి రుణమాఫీ చేశారని.. 34లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కేసీఆర్ అని విమర్శిచారు. రైతు బంధు పేరుతో రూ. 500 ఇచ్చి.. రూ. 25,000 పట్టుకుంటున్నారని ఆరోపించారు. అసలు రైతుకు భరోసానే లేదని.. ఈ ఏడేండ్లలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పాలన చేయమని అధికార మిస్తే ధర్నాలు చేస్తున్నారు. మీ కెందుకు ముఖ్యమంత్రి పదవి అని అడుగుతున్నాం..? కేంద్రం పెత్తనం ఏంటి..? ఆకరి గింజ వరకు కొంటామని కేసీఆర్ మాట ఇచ్చారు. కేంద్రం మెడలు వంచి అయినా సరే మేము వడ్లు కొంటామన్నారు. మరి ఇప్పుడు వారి మెడలు లావైనాయా..? మీ చేతులు సన్నగైనాయా..?

లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టారని.. ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో కలిపేందుకు కట్టారా..? లక్షల కోట్లు కమీషన్లు మింగేందుకు కట్టారా..? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.  ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతుందని..  ఈ కాలంలో ఎరువుల ధరలు 50శాతం పెరిగాయని.. ఆ భారం మొత్తం రైతులపైనే పడుతుందని అన్నారు. తర పార్టీల నాయకులను కొన్నంత సులువు కాదు పంట మార్పిడి చేయడం అని అన్నారు. ఇతర పంటలు వేసుకునే భరోసా రైతుకు కలిగేంత వరకు కేసీఆర్ వరి కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, ధర్నాచౌక్ వద్ద సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉండటంతో మిగిలిన నిరహార దీక్షను షర్మిల లోటస్ పాండ్‌ పార్టీ ఆఫీసులోలో పూర్తి చేస్తారని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios