'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం వైఖరిని తెలపాలని కోరుతూ ఆందోళనకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజీల్ ధరలపై విధించిన సెస్ ను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలను నిలదీయాలని కేసీఆర్ కోరారు.
హైదరాబాద్: కేంద్రంపై తెలంగాణ సీఎం Kcr యుద్ధం ప్రకటించారు. Punjab రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో చెప్పాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు వదిలిపెట్టబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.
రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన Bjp నేతలను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో Trs ఓటమి పాలైంది.ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన ఐదు రోజులకు వరిధాన్యం అంశాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక కేసీఆర్ వరి ధాన్యం అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
also read:నా ఫాంహౌస్ లో అడుగుపెడితే ఆరు ముక్కలవుతావు: బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
వచ్చే యాసంగిలో రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాస్తే తాము కేంద్రాన్ని ఒప్పిస్తామని బండి సంజయ్ సవాల్ విసిరారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా సంజయ్ బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగాడు.
వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని తీసుకొని కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే విషయాన్నికేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయమై బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్రంలోని మండల స్థాయి నుండి జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ పోరాటానికి కలిసివచ్చే పార్టీలను కలుపుకుపోవాలని కూడా టీఆర్ఎస్ భావిస్తోంది.
Petrol, డీజీల్ లపై కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అయితే అన్ని రాష్ట్రాలు కూడా తాము విధించిన పన్నులను తగ్గించాలని ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర చాలా తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్ ధర వంద రూపాయాలు దాటడానికి కేంద్రం విధించిన పన్నులే కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పెట్రోల్, డీజీల్ పై కేంద్రం విధించిన సెస్ ను తగ్గించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై బీజేపీ నేతలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్రంపై రెండు రోజులుగా కేసీఆర్ తీవ్ర విమర్శలను ఎక్కు పెట్టారు. కేంద్రాన్ని, బీజేపీ నేతలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తారని గులాబీ బాస్ మండిపడ్డారు. దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్, రూరల్ నక్సలైట్ అనే ముద్ర వేస్తారన్నారు. వీటితో పాటు ఐటీ, ఈడీ దాడులు చేస్తారని కూడా చెప్పారు. ఏడేళ్లుగా ఇదే రకమైన పద్దతులను బీజేపీ నేతలు అవలంభిస్తున్నారని కేసీఆర్ బీజేపీ తీరును ప్రజలకు వివరించారు. దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీగా బీజేపీ మారిందని కేసీఆర్ విమర్శలు చేశారు. అయితే తనకు వ్యాపారాలు, కంపెనీలు లేవని కేసీఆర్ తేల్చి చెప్పారు అంతేకాదు తనపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూడా కేసీఆర్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో యాదవులకు అందిస్తున్న గొర్రెల పథకానికి ఎన్‌సీడీసీ పథకం ద్వారా అప్పు తీసుకొన్నామన్నారు. ఈ పథకానికి కేంద్రం నుండి నిథులు ఇస్తున్నట్టుగా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తామని కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయమై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తూనే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టారు. అదే సమయంలో కేంద్రానికి కూడా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పథకాలను అమలు చేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేశారు. ఇంత కాలంపాటు కేంద్రంతో సర్ధుకుపోదామనే భావనతో ఉన్నానని ఇక నుండి కేంద్రంతో తాడోపేడో తేల్చుకొంటానని కేసీఆర్ తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభించిన విధానాల కారణంగా దేశానికి జరుగుతున్న నష్టాన్ని కూడా కేసీఆర్ వివరిస్తున్నారు. బీజేపీ విధానాలతో ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయో వివరిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు. చైనా మన దేశ భూబాగాన్ని ఇంచు ఆక్రమించుకోకుండా కాపాడాలని తాను కోరానని... ఇలా కోరడం కూడా దేశ ద్రోహం అవుతోందా అంటూ కేసీఆర్ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.
2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు గులాబీ బాస్ రంగంలోకి దిగారు. కేంద్రంపై యుద్ధంలో భాగంగా బీజేపీ తీరును ఎండగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. తాను లేవనెత్తె అంశాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.