ఈ నెల 20న హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో: అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
హైద్రాబాద్ నగరంలో మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం నిర్వహించే హాల్ ను కూడ దగ్దం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్: నగరంలో మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అడ్డుకొంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి టికెట్లు విక్రయిస్తున్న సంస్థతో పాటు కార్యక్రమం నిర్వహించే హాల్ ను కూడా దగ్దం చేస్తామని రాజాసింగ్ హెచ్చరించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీని మునావర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. మునావర్ హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు. మునావర్ గతంలో ఓ వర్గం దేవతలపై చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి వచ్చి హైద్రాబాద్ లో షో నిర్వహిస్తే ఈ షో ను ఎలా నడుస్తుందని రాజాసింగ్ ప్రశ్నించారు. తెలంగాణ నుండి మునావర్ ను కొట్టి పంపిస్తామని రాజాసింగ్ తేల్చి చెప్పారు ఈ షో కారణంగా తెలంగాణలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే ప్రబుత్వం, పోలీసు అధికారులదే బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారని ఈ కథనం ప్రసారం చేసింది.
హైద్రాబాద్ నగరంలో మునావర్ ఫరూఖీ కార్యక్రమం కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొంటున్న తరుణంలో బీజేపీ నేత రాజాసింగ్ వార్నింగ్ ఇవ్వడంతో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. ఈ నెల 20వ తేదీన హైద్రాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం కోసం బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ షో లో పాల్గొనేందుకు రూ. 499 లుగా టికెట్ ధర నిర్ణయించారు.ఈ ఏడాది జనవరి మాసంలో మునావర్ ఫరూఖీ హైద్రాబాద్ లో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మునావర్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.