పచ్చని సంసారంలో మద్యం చిచ్చు... 24గంటల్లోపే భార్యాభర్తల సూసైడ్
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య, అది తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

కొత్తగూడెం : మద్యం మహమ్మారి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి దంపతుల ఆత్మహత్యకు కారణమయ్యింది. తాగుబోతు భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురయిన తాగుబోతు భర్త కూడా సూసైడ్ చేసుకున్నాడు. కేవలం 24గంటల వ్యవధిలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు కొడుకులు అనాధలుగా మారి రోడ్డున పడ్డారు. ఈ దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(28) లారీ డ్రైవర్. నిరుపేద కుటుంబానికి చెందిన ఇతడికి కోలా అఖిల(21) తో కొన్నేళ్లక్రితమే పెళ్లయింది. వీరికి నరేంద్ర బాబు(3), అక్షిత్ కుమార్(1) ఇద్దరు పిల్లలు సంతానం. ఆస్తిపాస్తులు లేకున్నా రెక్కల కష్టంలో హాయిగా సాగుతున్న వీరి సంసారంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తోటి లారీ డ్రైవర్లతో కలిసి మద్యం తాగడం ప్రారంభించిన వెంకటేశ్వరరావు కొద్దిరోజులకు దానికి బానిసయ్యాడు.రోజూ సంపాదించిన డబ్బులన్ని మందు తాగడానికే ఖర్చుచేస్తూ భార్యాబిడ్డల ఆలనాపాలనా మరిచాడు.
భర్త తాగుడుకు బానిస కావడంతో కుటుంబ భారమంతా భార్య అఖిలపై పడింది. ఆమె కూలీపనులకు వెళుతూ కుటుంబ పోషణ చూసుకునేది. అయితే తాగిన మైకంలో ఇంటికి వచ్చే వెంకటేశ్వరరావు భార్యతో గొడవపడేవాడు. నిత్యం భర్త వేధింపులు భరించలేక అఖిల మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Read More హైదరాబాద్ లో ఇంటిముందు క్షుద్రపూజలు.. 16 యేళ్ల బాలిక ఆత్మహత్య..
భార్య ఆత్మహత్య గురించి తెలియడంతో వెంకటేశ్వరరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అతన్ని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ బుధవారం అతడి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మారారు.
ఒకేసారి వెంకటేశ్వరావు, అఖిల దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. తల్లిదండ్రులకు ఏమయ్యిందో తెలియన మృతదేహాల వద్ద అమాయకంగా కూర్చున్న చిన్నారులను చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)