Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ కు బాగా కోపమొచ్చింది

  • చీరల కాల్చివేతలపై కేటిఆర్ సీరియస్
  • విపక్షాలపై మండిపడ్డ కేటిఆర్
  • మీడియా కూడా సంయమనంతో వార్తలివ్వాలి
why ktr is angry today
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ సిఎం తనయుడు, చేనేత మంత్రి కేటిఆర్ కు బాగా కోపమొచ్చింది. తెలంగాణలో పండుగలా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ పలుచోట్ల వివాదం రేగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని మండిపడ్డారు. లక్షలాది చీరలు పంపిణీ చేసిన కాడ ఒకటి రెండు చోట్ల ఇలాంటి పరిణామాలు జరిగితే మీడియా కూడా పట్టించుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. ఇక కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు సిగ్గులేకుండా వ్యవహరించాయన్నారు. నీచాతి నీచంగా కుట్రలు చేసి జనాల్లో నవ్వులపాలయ్యాయని మండిప్డడారు. సచివాలయంలో చీరల పంపిణీపై కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా కరుకుగానే సమాధానం చెప్పారు. మొహంలో సీరియస్ నెస్ ఛాయలు కనిపించాయి.

తెలంగాణలో చీరల పంపిణీ బ్రహ్మాండ్లంగా జరుగుతుంటే కాంగ్రెస్, టిడిపి నేతలు బట్ట కాల్చి మీదేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటిఆర్. బతుకమ్మ కానుక చీరల పంపిణీ ద్విముఖ వ్యూహంతో కొనసాగుతున్నదని తెలిపారు. 31 జిల్లాల్లో 8వేల సెంటర్లలో 25 లక్షల చీరలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పండుగ సందర్భంగా మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సర్కారు చీరల పంపిణీ ఆత్మీయంగా చేపడుతున్నదన్నారు. చీరల పంపిణీకి ముందే ప్రతిపక్షాలు కృత్రిమ నిరసనలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల్లో ఎవరికైనా కోటి చీరలు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా..? కట్టుకునే బట్టలను ఎవరైనా కాలుస్తారా?..ఇంత కుసంస్కారంతో కూడుకున్న రాజకీయం అవసరమా..? కేటీఆర్ ప్రశ్నించారు. లోటుపాట్లుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ..చిల్లర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.

కాంగ్రెస్ హయాంలో ఎందుకు చీరల పంపిణీ చేయలేదని, కోటి మందికి చీరల పంపిణీ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచిపని చేస్తుంటే అభినందించకపోయినా పర్వాలేదు కానీ.. వ్యతిరేకించడం మంచిది కాదని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. చీరలు నచ్చకపోతే మహిళలు ఎవరూ తగలబెట్టరని.. మహిళలు చీరలు తీసుకొని ఇంటికి వెళ్తుంటే గుంజుకుని తగలబెట్టిన్రని కేటీఆర్ మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులే చేస్తున్నారని, చీరలు కాలబెట్టి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తరా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. 

పవర్‌లూమ్‌కు..హ్యాండ్‌లూమ్‌కు తేడా తెలియనివాళ్లు చాలా మంది ఉన్నరు. చేయగలిగితే నిర్మాణాత్మకంగా విమర్శించండి..ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టు చేయలేదని తెలిపారు. వారం రోజుల క్రితమే దసరా చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ పత్రికలో ప్రచురించిన్రు. మీడియా కూడా ఆలోచించి సరైన కోణంలో వాస్తవాలు చూపించాలని కోరారు. చేనేతకు, మరనేతలకు తేడా తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నరని, విపక్ష నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నరని మండిపడ్డారు. సిరిసిల్ల నేత కార్మికుల జీతాలు రెట్టింపు అయినయి. ఇవన్నీ చూసి కాంగ్రెస్‌కు కన్నుకుట్టిందని విమర్శించారు కేటిఆర్.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios