ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్  నియోజకవర్గం నుండి  అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా  కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతోందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

గజ్వేల్:ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుండి అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపుతోందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే ప్రజా యుద్దనౌక గద్దర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సానుకూలంగా సంకేతాలు ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతోందోననే చర్చ సాగుతోంది.

2014 ఎన్నికల్లో గజ్వేల్ సెగ్మెంట్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ విజయం సాధించారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఈ ఎన్నికల్లో 67వేలకు పైగా ఓట్లు లభించాయి.

తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి మూడు మాసాల క్రితమే టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. 

ఇదిలా ఉంటే ప్రజా యుద్దనౌక గద్దర్ బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని నమ్ముతున్నట్టుగా ప్రకటించారు. తొలిసారిగా గద్దర్ ఓటుహక్కును నమోదు చేసుకొన్నారు. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. 

ఇదిలా ఉంటే గత ఏడాది గద్దర్ కొడుకు సూర్యం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాలుగు రోజుల క్రితం గద్దర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడ కలిశారు. 

తాను ఏ పార్టీలో చేరబోనని గద్దర్ ప్రకటించారు. అయితే అన్ని పార్టీలు తనకు మద్దతిస్తే గజ్వేల్ నుండి పోటీ చేసేందుకు కూడ తాను సిద్ధమేనని గద్దర్ ప్రకటించారు. కేసీఆర్‌పై గద్దర్ ను పోటీకి దింపాలని మహాకూటమిలోని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయమై గద్దర్‌ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అన్ని పార్టీలు గద్దర్‌కు మద్దతుగా నిలుస్తాయా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే గజ్వేల్ నుండి అన్ని పార్టీలు మద్దతుగా నిలిస్తే గజ్వేల్ నుండి కేసీఆర్ పై పోటీ చేసేందుకు తాను సిద్దమని గద్దర్ ప్రకటించడం ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇబ్బందిగా మారింది.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ స్థానం నుండి కేసీఆర్ పై మరోసారి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్న తరుణంలో గద్దర్ ప్రకటన గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి కారణమైంది.

గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగుతారా... విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ పోటీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సంబంధిత వార్తలు

రాహుల్ గాంధీ కోరిందేమిటి: గద్దర్ వ్యూహం ఏమిటి?

రాహుల్ గాంధీతో భేటీ మతలబు: ఎవరీ గద్దర్?

70 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కు: కేసీఆర్‌‌కు షాకిచ్చిన గద్దర్