తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎవరు?:రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలలో ఎవరికి దక్కునో
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఎంపిక ఈ నెల 28న జరగనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభపక్ష నేత ఎంపిక జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్ష నేత పదవి ఎవరిని వరించనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మూడు దఫాలు విజయం సాధించి రాజాసింగ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. రెండు దఫాలు విజయం సాధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడ బీజేపీ శాసనసభ పక్ష నేత పదవికి పోటీలో ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. గోషామహల్ నుండి బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. 2022 ఆగస్టు 23న రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించింది బీజేపీ నాయకత్వం. రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించిన తర్వాత అసెంబ్లీలో బీజేపీపక్షనేతను ఆ పార్టీ ప్రకటించలేదు.ఈ లోపుగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడ విడుదలైంది.
ఈ సస్పెన్షన్ ను 2023 అక్టోబర్ 22న బీజేపీ నాయకత్వం ఎత్తివేసింది. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రాజాసింగ్ కు చోటు కల్పించింది ఆ పార్టీ నాయకత్వం.
ఈ దఫా బీజేపీ నుండి విజయం సాధించిన అభ్యర్థుల్లో టి. రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే సీనియర్లు. మిగిలిన వారంతా కొత్తవాళ్లే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. రాజాసింగ్ చాలా కాలం నుండి బీజేపీలో కొనసాగుతున్నారు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనససభ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తర్వాత బీజేపీ శాసనసభపక్ష నేతగా ఆ పార్టీ ఇంకా ఎవరిని నియమించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన హైద్రాబాద్ కు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు దిశా నిర్ధేశం చేసేందుకు అమిత్ షా వస్తున్నారు. ఈ సందర్భంగానే బీజేపీ శాసనసభపక్ష నేతను ఎన్నుకుంటారు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
గత అసెంబ్లీలో శాసనసభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించిన రాజాసింగ్ నే మరోసారి బీజేపీ పక్ష నేతగా కొనసాగిస్తారా లేక మహేశ్వర్ రెడ్డికి ఈ పదవి దక్కుతుందా అనే చర్చ లేకపోలేదు. ఈ ఇద్దరిని పక్కన పెట్టి మరొకరికి అవకాశం ఇస్తారా అనేది ఈ నెల 28న తేలనుంది.