టిడిపికి రెబెల్ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అమరావతి వేదికగా అందించారు. పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్ కు రాజీనామా లేఖను అందజేశారు. ఇప్పుడు ఆ రాజీనామా లేఖలో ఏం రాశారన్నదానిపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజీనామా లేఖలో ఈ కింది అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

గతకొంత కాలంగా పార్టీలో, బయట జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. పార్టీ పై, పార్టీ అధ్యక్షుడి పై నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసింది. నా ఎదుగుదలకు బాబు ఎంతో కృషి చేశారు.

చంద్రబాబు నాకు తండ్రితో సమానం. ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని నేను. ఏపీ, టీ టీడీపీ సీనియర్ నాయకులు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీ టీడీపీని నాశనం చేస్తున్నారు.

నేను కేసీఆర్ పై పోరాటం చేస్తుంటే ఏపీ, టి టీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారు. మరి కొంతమంది టీఆరెస్ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు నా పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుంది.

నన్ను ఇబ్బందులకు గురిచేయడం కోసం, నన్ను దెబ్బకొట్టడం కోసం కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారు. నేను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తిని, నా స్వార్థం కోసం ఎప్పుడు పార్టీని అడ్డుపెట్టుకోలేదు. టీడీఎల్పీ నేతగా ఉన్నా నా కన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్ కు గతంలో లేఖ రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం పార్టీలోని మా ఎమ్మెల్యేలకు ఇచ్చాను.

కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిపించాలి. నా పోరాటం ఎప్పుడు కేసీఆర్, trs పైనే ఉంటుందని ఎన్నోసార్లు స్పష్టం చేశాను. పార్టీ క్యాడర్ ను చూస్తే చాలా బాధగా ఉంది. తెలంగాణలో టీడీపీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబే కారణం. టీడీపీ క్యాడర్ నాకు ప్రాణ సమానం.

కొడంగల్ లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటాను. అని తన రాజీనామా లేఖలో రేవంత్ ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి టిడిపిలో ఉండి కేసిఆర్ తో స్నేహం చేస్తున్న నాయకుల విషయంలో ఆవేదన చెంది బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మాటల సందర్భంలో పరిటాల కుటుంబం, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు లాంటి నాయకులంతా కేసిఆర్ తో అంటకాగుతున్నాని రేవంత్ ఆరోపించారు కూడా. అయితే వారి పేర్లను తన రాజీనామా లేఖలో రాయకుండా కేవలం వారి ప్రస్తావనను మాత్రం తీసుకొచ్చినట్లు తెలిసింది.

అలాగే.. ఈ అంశాలను కూడా రేవంత్ తన లేఖలో పొందుపరిచారు.

 మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం మరిచిపోలేనిది. మీ సారథ్యంలో అనేక ప్రజాపోరాటాలలో భాగస్వామి కావడం అదృష్టం. మీ అనుచరుడుగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం నేను గర్వించే విషయం. టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతం, మీ నిర్ణయాలకు కంకణబద్దుడనై పని చేశాను. తక్కువ సమయంలో మీరు, పార్టీ నాకు గుర్తింపునిచ్చారు. సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు. వాటన్నింటినీ నా శక్తిమేరకు సమర్ధవంతంగా నిర్వర్తించానని నమ్ముతున్నాను.

కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. వాళ్లు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు. పోరాటాల్లో నా వెన్నంటి ఉన్నారు. మీ ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతో నలభై నెలలుగా కేసీఆర్ అరాచకాల పై పోరాడాను. ఎన్టీఆర్ కూడా నా పోరాటానికి స్ఫూర్తి. అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగుకోసం ఆయన తపించిన విధానం నాకు స్ఫూర్తి. టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం. 

కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయి. ఏ వర్గాన్ని తట్టి చూసినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వేల మంది రైతులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీశారు. మల్లన్న సాగర్ ను రావణకాష్టంగా మార్చారు. నేరేళ్లలో దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లిలో గుత్తికోయల ఆడబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టారు. ఇలాంటి హృదయవిదారక సందర్భాలు అనేకం. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు.

ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటు లేదు. వ్యవస్థల పతనం నిరాఘాటంగా సాగుతోంది. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం..అసెంబ్లీలో సస్పెన్షన్ లు నిత్యకృత్యమయ్యాయి. నాపై వ్యక్తిగతంగా కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించిన విషయం మీకు తెలుసు. జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు. 

ఆ సమయంలో మీరు, భువనేశ్వరి మేడమ్ కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు. తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉదృతంగా పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణ సమాజం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడండి.

కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం, శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నాను. తెలంగాణ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యదా భావించక నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.